Google Pay | గూగుల్ పే భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ విదేశాలకు సైతం యూపీఐ సేవలను విస్తరిస్తున్నది. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(NPCI) చెందిన ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నది. భారత్ వెలుపలా యూపీఐ సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో ప్రకటించింది.
దాంతో ఇతర దేశాల్లోనూ సులువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. ఇకపై విదేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లడం, ఇంటర్నేషనల్ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. భారత్ వెలుపల సులువుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు కొనసాగించడం.. ఇతర దేశాల్లోనూ యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేయడంలో సహాయం, వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియను సులభంతరం చేయడం ఒప్పందం ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ఇకపై విదేశాల్లో ఉన్న వారికి డిజిటల్ చెల్లింపులు చేసేందుకు విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఎన్‌పీసీఎల్ సీఈవో రితేశ్ శుక్లా పేర్కొన్నారు.
గూగుల్ పేతో భారత్ వెలుపల సైతం యూపీఐ చెల్లింపులు చేయవచ్చన్నారు. అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని మరింత పటిష్టం చేస్తుందనే నమ్మకం ఉందని రితేశ్ శుక్లా చెప్పారు. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే ఎన్‌ఆర్‌ఐలు దేశానికి పంపే నగదు వాటా శాతం అధికంగా ఉంటుంది. కుటుంబీకులు, స్నేహితులకు డబ్బులు పంపే సమయంలో దళారులు చార్జీల పేరుతో లూటీ చేస్తున్నారు. కాయాకష్టం చేసి దాచిన సొత్తు అయిన వారికి పంపేందుకు ప్రయత్నిస్తే ఇతరులు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో ఛార్జీలకు కళ్లెం వేసేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఈ నిర్ణయం తీకున్నది. విదేశాల్లో ఉన్న వారు సైతం సులువుగా యూసీఐ ద్వారా భారత్‌లో ఉంటున్న వారికి డబ్బులు పంపుకునేందుకు ఎన్‌పీసీఐ వీలు కల్పించింది.