TSPSC: గ్రూప్ వన్ కూడా లీకైంది: రేవంత్ రెడ్డి
విధాత: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొదటి శాసన సభ సమావేశాల్లో ఖాళీగా ఉన్న ఒక లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించిన సిఎం కె.చంద్రశేఖర్ రావు తొమ్మిదేళ్లు అయినా అమలు చేయలేదని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో రేవంత్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఆ […]

విధాత: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొదటి శాసన సభ సమావేశాల్లో ఖాళీగా ఉన్న ఒక లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించిన సిఎం కె.చంద్రశేఖర్ రావు తొమ్మిదేళ్లు అయినా అమలు చేయలేదని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు.
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో రేవంత్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఆ ఉద్యమాన్ని కెసిఆర్ ఉపాధిగా మల్చుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ఉపాధి లభించక రెండు వేల మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. టిఎస్ పిఎస్సీ ప్రశ్న పత్రాలు ఎలా లీక్ అయ్యాయో సిఎం ఇంత వరకు వివరణ ఇవ్వలేదని, పబ్లిక్ సర్వీసు కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్నారు.
గ్రూప్ వన్ పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మాస్ కాపీయింగ్ జరిగిందనే భయం అభ్యర్థుల్లో నెలకొందన్నారు. ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ కాంట్రాక్టు మంత్రి అనుచరులకు దక్కడంతో తప్పులు దొర్లి 24 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారన్నారు. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ పేపర్ లీకేజీల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
టిఎస్ పిఎస్సీ(TSPSC)లో 400 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా కేవలం 80 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఔట్ సోర్సింగ్‌తో సంస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రశ్నపత్రాల లీకేజీ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నివేదిక తెప్పించుకుని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని, ఈ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు.
రూ.900 కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అయితే కెసిఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు బలైందన్నారు. మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని, భూ నిర్వాసితులపై కేసులను బేషరతుగా ఉపసంహరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రీ డిజైన్‌ను వెనక్కి తీసుకుని మంచిప్ప ప్రాజెక్టను పాత డిజైన్ ప్రకారమే చేపట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచిప్పని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.