Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఆయా పార్టీల నాయకులు.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ప్రచారంలో భాగంగా నాయకులకు పలు చోట్ల నిరసనలు ఎదురవుతుంటాయి. ఇక ప్రజలు కూడా తమకిచ్చిన హామీలను గుర్తు చేస్తూ నిలదీస్తుంటారు. హమీలను నెరవేర్చే దాకా ఎన్నికలకు దూరంగా ఉంటామని నాయకులను ప్రజలు హెచ్చరిస్తుంటారు. ఆ మాదిరిగానే గుజరాత్‌లోని నవ్‌సారి అసెంబ్లీ పరిధిలోని 18 గ్రామాల ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఓటేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.
అయితే అంచేలితో పాటు 17 గ్రామాల ప్రజల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంచేలి రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లను ఆపడం లేదని స్థానికులు వాపోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత రైళ్లను ఆపడం లేదని పేర్కొన్నారు. రైళ్లను ఆపకపోవడంతో.. రెగ్యులర్ ప్రయాణికులు రూ. 300 వరకు ప్రయివేటు రవాణాకు ఖర్చు చేసి, తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారని స్థానికులు స్పష్టం చేశారు. విద్యార్థులు, లెక్చరర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. నో ట్రైన్.. నో వోట్స్ అని బ్యానర్లు ప్రదర్శించారు. ఒక వేళ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొచ్చినా ఖాళీ ఈవీంఎలను వెనక్కి పంపుతామని స్థానికులు ప్రకటించారు.