Gutta Sukhender Reddy | పర్యావరణ అనుమతులతో డిండి పరుగులు: గుత్తా
Gutta Sukhender Reddy | 3.61లక్షల ఎకరాలకు సాగునీటి వసతి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విధాత: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చిన నేపధ్యంలో ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకానికి కూడా లైన్ క్లియర్ అవ్వడంతో ఇక ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతు సీఎం కేసీఆర్ పట్టుదలతో కరవు, ఫ్లోరైడ్ పీడిత […]

Gutta Sukhender Reddy |
- 3.61లక్షల ఎకరాలకు సాగునీటి వసతి
- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
విధాత: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చిన నేపధ్యంలో ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకానికి కూడా లైన్ క్లియర్ అవ్వడంతో ఇక ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
నల్లగొండలో ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతు సీఎం కేసీఆర్ పట్టుదలతో కరవు, ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు పాలమూరు ఎత్తిపోతల పథకంలోని రెండు టీఎంసీల నుంచి అర టీఎంసీ డిండి ఎత్తిపోతల పథకానికి అందడం ద్వారా 3.61లక్షల ఎకరాలకు సాగునీటీ వసతి లభించనుందన్నారు.
ఇందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఆర్ (CM KCR)కు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. నార్లాపూర్ నుంచి ఎదుళ్లకు అక్కడి నుంచి డిండికి గ్రావిటీ ద్వారా నీరు తేవాలని తొలి ప్రతిపాదన ఉందని, మరో ప్రత్యామ్నాయంగా ఇటీవల వట్టెం నుంచి ఎత్తిపోతల ద్వారా తేవాలానే రెండో ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందన్నారు.
రెండింట్లో ఏదో ఒక ప్రతిపాదన ద్వారా డిండికి నీళ్లు రావడం ఖాయమన్నారు. ఇక డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే గొట్టిముక్కల 98 శాతం, కిష్టారాంపల్లి, చర్లగూడెం 70 శాతం పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ పనులు కూడా మరింత వేగంగా పూర్తి కావచ్చన్నారు.
మరోవైపు కల్వకుర్తి (Kalvakurti) లిఫ్ట్ పథకం రీ జనరేటర్ వాటర్ ద్వారా గత మూడు నాలుగు ఏండ్లగా డిండి రిజర్వాయర్ కి వరద వచ్చి అలుగు పోస్తుందని గుర్తు చేశారు. దీనితో డిండి రిజర్వాయర్ కింద ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ అలుగు నీటితో నక్కలగండి రిజర్వాయర్‌ను కూడా నింపొచ్చని, నక్కలగండి పనులు కూడా 98 శాతం పూర్తి అయ్యాయని, గేట్లు బిగిస్తే నీరు నిల్వ ఉండనుందన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ (SLBC) సొరంగమార్గం పనుల పూర్తికి టెక్నికల్ గా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆ లోపు నక్కలగండికి డిండి రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించవచ్చన్నారు. ఇక కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో తెలంగాణ కు తొమ్మిదేళ్లుగా తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. నది జలాల పంపకం పూర్తి అయితే ఇంకా వేగంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.
ప్రస్తుత సీజన్‌లో శ్రీశైలంలో మరో వంద టీఎంసీలు, సాగర్ లో మరో రెండు వందల టీఎంసీల నీరు వస్తే నిండుతాయని, అధికారులు చెపుతున్న ప్రకారం మరో 20, 30 టీఎంసీల నీరు వస్తే సాగర్ మొదటి జోన్ వరకు సాగునీరు ఇవ్వవచ్చని, ఇప్పటికే 30 టీఎంసీ ల వరకు అందుబాటులో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయన్నారు.
ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగునీరు అడుగుతున్నారని, సెప్టెంబర్ వరకు వరదలు వచ్చే ఛాన్స్ ఉంందని, అప్పుడు సాగర్‌కు వరద వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు కనీస మట్టం లేకుండా ఏపీకి నీటిని తీసుకునే హక్కు లేదని,. కానీ కరెంట్ ఉత్పత్తి మాత్రం చేసే హక్కు తెలంగాణ కు ఉందన్నారు.