హర్యానాలో విశ్వాసం పొందిన నాయబ్‌సింగ్‌ సర్కార్‌

హర్యానా అసెంబ్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గింది. మంగళవారం నాటకీయ పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ రాజీనామా

  • Publish Date - March 13, 2024 / 04:31 PM IST

విప్‌ ఉల్లంఘించిన నలుగురు జేజేపీ సభ్యులు

చండీగఢ్‌: హర్యానా అసెంబ్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గింది. మంగళవారం నాటకీయ పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ రాజీనామా, అనంతరం నాయబ్‌ సింగ్‌ సైని ప్రమాణం వెంట వెంటనే జరిగిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు నాయబ్‌సింగ్‌ తన ప్రభుత్వంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 90 మంది సభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపికి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితోపాటు ఆరుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు, హర్యానా లోక్‌హిత్‌ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. ఓటింగ్‌కు హాజరుకావద్దంటూ జననాయక్‌ జనతాపార్టీ (జేజేపీ) విప్‌ జారీ చేసినా.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఓటింగ్‌కు హాజరయ్యారు. అయితే.. తర్వాత వాకౌట్‌ చేశారు. విశ్వాస తీర్మానం అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎల్‌ ఖట్టర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.

ఓబీసీ నాయకుడైన నాయబ్‌సింగ్‌ సైని.. కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. అంబాలాలోని మిజాపూర్‌ మజ్రాలో 1070 జనవరి 25న జన్మించిన సైని.. ముజఫర్‌పూర్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ బీహార్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, మీరట్‌లోని సీహెచ్‌ చరణ్‌సింగ్‌ యూనివర్సిటీనుంచి ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. ఆయనకు భార్య సుమన్‌సైని, కుమార్తె వంశిక సైని, కుమారుడు అంకిత్‌ సైని ఉన్నారు.

Latest News