తమిళనాడులో భారీ వర్షాలు.. నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునేల్‌వేలి, ట్యూటికోరిన్, టెన్‌కాశీ, కన్యాకుమారి జిల్లాలో కుండపోతగా వర్షం పడుతోంది.

- ప్రధాని సాయం అందించాలని లేఖ రాసిన
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
చెన్నై : ఇటీవలి తుఫాన్ నుంచి కోలుకోకముందే తమిళనాడును మళ్లీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని తిరునెల్వేలి, టుటికోరిన్, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలకు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలలో వర్షాలు, వరదల పరిస్థితిపై చర్చించడానికి మంగళవారం అపాయింట్‌మెంట్ కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సాయం అందించాలని లేఖ రాశారు.
ఈ నేపథ్యంలోముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రులు, సీనియర్ అధికారులతో సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలను చేపట్టాలని సూచించారు. 50 మంది సభ్యులతో కూడిన రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు తిరునల్వేలి మరియు టుటికోరిన్ జిల్లాలకు వెళ్లగా, కన్యాకుమారి జిల్లాలో మూడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలను మోహరించారు. 7,500 మందిని తరలించి 84 సహాయ శిబిరాల్లో ఉంచారు. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా 62 లక్షల మందికి ఫోన్లలో హెచ్చరికలు పంపారు.
అర్ధరాత్రి 1:30 గంటల వరకు ట్యూటికోరిన్ జిల్లాలోని తిరుచెందూరులో అత్యధికంగా 60 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరునేల్‌వేలిలోని పాలయంకొట్టాయిలో 26 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కన్యాకుమారిలో 17.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలకు పాపనాశనం, పెరుంజని, పెచుపారాయి డ్యాంలకు వరద పోటెత్తింది. దీంతో ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో తిరునేల్‌వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో వరద ఉధృతంగా ఉంది. పలు చోట్ల మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవాళ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలపై సీఎం స్టాలిన్ మంత్రులు, సీనియర్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక, పునారావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పర్యవేక్షణ చేయాలని సూచించారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ట్యూటికోరిన్, తిరునేల్‌వేలి, కన్యూమారి జిల్లాలకు ఈ బృందాలు తరలివెళ్లాయి. 4 వేల మంది పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తిరునేల్‌వేలి నుంచి బయల్దేరిన వందే భారత్ రైలుతో సహా 17 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.