మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి: హైకోర్టు

విధాత, హైదరాబాద్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 5089 పోస్టులను భర్తీకి ప్రకటన చేసింది. అందులో మహిళలకు 51% పోస్టులను కేటాయించారు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అందుకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుండి అన్ని నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.
అయినప్పటికీ తెలంగాణ విద్యాశాఖ మహిళా, వికలాంగుల, ఎక్స్ సర్వీస్ మెన్ తదితర రిజర్వేషన్లను వర్టికల్ గా అమలు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళ, వికలాంగుల ఎక్స్ సర్వీస్మెన్ తదితర కోటాలను సమాంతరంగా అమలు చేయాలని బొడ శ్రీనివాసులుతోపాటు తదితరులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవి దేవి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుంకర చంద్రయ్య వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో అమలు చేస్తున్నట్లుగా ఉపాధ్యాయ నియామకాల్లో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాజేష్ కుమార్ దరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్పు ప్రకారం మహిళా, వికలాంగుల, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌సీసీ తదితర కోటాలను సమాంతరంగా అమలు చేయాలని వాదనలు వినిపించారు.
అట్టి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఉపాధ్యాయ నియామకాల్లో కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారం మహిళ, వికలాంగుల, ఎక్స్ సర్వీస్మెన్, ఎన్‌సీసీ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు వల్ల వందలాది పురుష మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగి మహిళలకు 33.33% ఉద్యోగాలు దక్కనున్నాయి.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అన్ని నియామకాలకు వర్తించే విధంగా గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నం 77ను జారీ చేసిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులను జారీ చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.