జడ్జి కుమారుడు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయరా..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
పోలీసు స్టేషన్ ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా..? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా..? జ్యుడిషీయల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా..? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా..?

హైదరాబాద్ : పోలీసు స్టేషన్ ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా..? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా..? జ్యుడిషీయల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా..? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా..? ఓ మహిళ పోలీసు స్టేషన్‌కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా కోర్టు ముందు హాజరు కాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కరీంనగర్ టు టౌన్ ఎస్‌హెచ్‌వో ఓదెల వెంకట్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టు సూచించిన విధంగా ఓదెల వెంకట్ వ్యక్తిగతంగా ఈ నెల 17వ తేదీన హైకోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. మహిళ ఫిర్యాదుపై ఫిబ్రవరి 14వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జాప్యంపై వారి తరపున క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. కోర్టు స్పందిస్తూ ఈ విషయంలో ఎస్‌హెచ్‌వోను వదిలిపెట్టలేమని, ఆయన వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ నెల 13వ తేదీన ఓ మహిళ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలీసు స్టేషన్లో ఉంటే, ఆమె ఎందుకు వచ్చారు..? సమస్య ఏంటని అడగాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దీనిపై ఎస్‌హెచ్‌వో సమాధానం చెప్పాలిందే. పోలీసుల విధులపై సర్క్యులర్ జారీ చేసేలా డీజీపీకి చెప్పాలి. ఇక్కడ పిటిషన్‌దారు తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఒక వేళ అది నిజం కాకపోయినా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. తర్వాత దర్యాప్తులో అసలు విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్‌పై అభ్యర్థనలను మూసివేస్తున్నాం. అయితే ఎస్‌హెచ్‌వోను వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నాం అని కోర్టు తెలిపింది.
అసలేం జరిగిందంటే..?
కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఆఫీస్ సబార్డినేట్‌గా నియమితులయ్యారు. అయితే సెషన్స్ జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను గతేడాది అక్టోబర్ 6వ తేదీన సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంలో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తీవ్రంగా స్పందించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎస్‌హెచ్‌వో కోర్టుకు హాజరు కావాలని సూచించింది.