బాంబు పెట్టిన‌ట్టు ఫేక్ కాల్.. 24 గంట‌ల్లోనే నిందితుడి అరెస్టు

కర్ణాట‌క రాజ్‌భ‌వ‌న్‌లో బాంబు పెట్టిన‌ట్టు బెదిరించిన కేసులో 24 గంట‌ల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ కోసం అత‌డిని బెంగ‌ళూరుకు త‌ర‌లించారు

బాంబు పెట్టిన‌ట్టు ఫేక్ కాల్.. 24 గంట‌ల్లోనే నిందితుడి అరెస్టు
  • కర్ణాట‌క రాజ్‌భ‌వ‌న్‌కు బాంబు
  • బెదిరింపు కేసులో క‌ర్ణాట‌క‌ యువ‌కుడు అరెస్టు
  • పోలీసుల‌కు ప‌ని క‌ల్పించాల‌ని కొంటే ప‌ని


విధాత‌: కర్ణాట‌క రాజ్‌భ‌వ‌న్‌లో బాంబు పెట్టిన‌ట్టు బెదిరించిన కేసులో 24 గంట‌ల్లోనే నిందితుడిని పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. విచార‌ణ కోసం అత‌డిని బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. బెంగ‌ళూరులోని రాజ్‌భ‌వ‌న్‌లో బాంబు పెట్టాన‌ని, అది కాసేప‌ట్లో పేలుతుంద‌ని ఎన్ఐఏ కంట్రోల్ రూమ్‌కు సోమ‌వారం రాత్రి 11.30 గంట‌ల ప్రాంతంలో ఓ అంగ‌త‌కుడి నుంచి ఫోన్‌వ‌చ్చింది.


ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క పోలీసుల‌కు ఎన్ఐఏ చెప్పి అప్ర‌మ‌త్తం చేసింది. బాంబు స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో వ‌చ్చిన సిబ్బంది క్షుణ్ణంగా ప‌రిశీలించినా బాంబు ల‌భించ‌లేదు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఓ అగంత‌కుడు ఫేక్ కాల్ చేసిన‌ట్టు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకొని అత‌డి ఆచూకీ కోసం ద‌ర్యాప్తు ప్రారంభించారు.


క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లా వ‌డ్డ‌హ‌ల్లిలో రైతు కుటుంబానికి చెందిన భాస్క‌ర్ అనే యువ‌కుడు బాంబు బెదిరింపు కాల్ చేసిన‌ట్టు ద‌ర్యాప్తులో తేల్చారు. భాస్క‌ర్ ఏపీలోని చిత్తూరు జిల్లాకు వ‌చ్చి కొత్త సిమ్ కొనుగోలు చేసి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. గూగుల్‌లో ఎన్ఐఏ కంట్రోల్ రూమ్ నంబ‌ర్ క‌నుగొని రాజ్‌భ‌వ‌న్ బాంబు పెట్టిన‌ట్టు బెదిరించాడు. పోలీసుల‌కు ప‌ని క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే బాంబు బెదిరింపు కాల్స్ చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ తేలింది. కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.