అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎంత వయసుండాలి? కొత్త బిల్లులో ఏముంది!

అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితే కానీ పెళ్లి చేయకూడదనేది ప్రస్తుతం ఉన్న చట్టం. వాస్తవానికి 18 ఏళ్లు అనేది ఐక్య రాజ్య సమితి (United Nations Organisation) నిర్ణయించిన ప్రామాణికం. 18 ఏళ్లు దాటిన యువతి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మానసిక పరిణతి కలిగి ఉంటుందని, అదే సమయంలో బిడ్డను కనేందుకు శారీరకంగా కూడా అనువైన పరిస్థితి ఉంటుందని దానిని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని పాటిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అమ్మాయిల […]

  • By: krs    latest    Feb 19, 2023 5:21 AM IST
అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎంత వయసుండాలి? కొత్త బిల్లులో ఏముంది!

అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితే కానీ పెళ్లి చేయకూడదనేది ప్రస్తుతం ఉన్న చట్టం. వాస్తవానికి 18 ఏళ్లు అనేది ఐక్య రాజ్య సమితి (United Nations Organisation) నిర్ణయించిన ప్రామాణికం. 18 ఏళ్లు దాటిన యువతి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మానసిక పరిణతి కలిగి ఉంటుందని, అదే సమయంలో బిడ్డను కనేందుకు శారీరకంగా కూడా అనువైన పరిస్థితి ఉంటుందని దానిని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని పాటిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అమ్మాయిల వివాహ వయసును 21 ఏండ్లకు పెంచేందుకు ఉద్దేశించిన బాల్య వివాహాల నిషేధ (Child Marriage) చట్టం (సవరణ) బిల్లు-2021ను 2021 డిసెంబర్‌ 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అది పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నది. ఇటీవలే కమిటీ గడువును కూడా పొడిగించారు. -విధాత

కొత్త బిల్లులో ఏముంది?

ఇతర అంశాల్లో మానసికంగా పరిణతి చెందినా.. వివాహం విషయంలో 18 ఏళ్ల వయసులో యువతులు తగిన నిర్ణయం తీసుకోగల స్థితిలో ఉండరనేది కేంద్రం ప్రతిపాదించిన కొత్త బిల్లులోని కారణం. కనుక యువతుల సాధికారత కోసమే తాము కొత్త బిల్లు తెస్తున్నామనేది అధికార పార్టీ వాదన. అందులో తప్పేముందని వాదించే వారూ లేకపోలేదు. నిజానికి 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు వివాహ వయసును పెంచడం అనేది పక్కన పెడితే.. దేశంలో ఇంకా గణనీయ సంఖ్యలో గుట్టుచప్పడు కాకుండా బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్న పరిస్థితి ఉన్నది.

ముందుగా దీనిని అరికట్టాల్సి ఉన్నది. చిన్న పిల్లగా ఉండగానే ఓ అయ్య చేతిలో పెట్టడం అనేదేమీ సరదా కాదు. దీని వెనుక ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆడ బిడ్డల్ని చదివించే స్థోమత లేనివారు కొందరు.. కట్నాలు ఇచ్చుకోలేక మరికొందరు, సమాజంలో ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న అరాచకాలను చూసి భయపడి కొందరు చిన్నతనంలోనే కూతుళ్లకు పెళ్లిళ్లు (Child Marriage) చేస్తుంటే.. పిల్లల్ని పెంచే శక్తి లేని పేద కుటుంబాలు (Poor Families).. పెళ్లి చేస్తే వేరే ఇంట్లోనైనా నాలుగు మెతుకులు తింటుందన్న ఆశతో చేసేవారూ ఉన్నారు. ఇదే ప్రధానమైన సమస్య. ఆర్థిక ఇబ్బంది, పేదరికం (Poverty)) అనేది ఒక పేద కుటుంబాన్ని బాల్య వివాహాల వైపు బలవంతంగా నెట్టేస్తున్నది.

జాతీయ ఆరోగ్య సర్వే ఏం చెప్తున్నది?

గత ఐదేళ్లతో పోల్చితే బాల్య వివాహాలు (Child Marriage) 27 శాతం నుంచి 23 శాతానికి తగ్గాయి. అయితే.. అందులోనూ పట్టణ ప్రాంతాల్లోనే ఈ తగ్గుదల ఎక్కువ కనిపిస్తున్నది. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లో 20-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరికి 18 ఏళ్లకు ముందే వివాహాలు జరిగాయని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే పేర్కొంటున్నది. ఇటీవలి కరోనా (Covid) కాలం కూడా ఇందుకు ఒక కారణం.

కొవిడ్‌ సృష్టించిన విధ్వంసంలో ‘చిన్నారి పెళ్లి కూతుళ్లు’ సమిథలయ్యారు. 2020 మార్చి నుంచి మే మధ్య కాలంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలల హెల్ప్‌ లైన్‌కు బాల్య వివాహాలపై 5200 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎప్పుడో 1978లోనే వివాహ వయసును బాలికలకు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు, అబ్బాయిలకు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ చట్టం చేశారు. అయినా.. బాల్య వివాహాలను తగ్గించడంలో వైఫల్యమే కనిపిస్తున్నది.

త్వరగా మాతృత్వం వస్తే..

ప్రభుత్వం చెప్పే మరో వాదన ఏమిటంటే.. 18 ఏళ్లకే పెళ్లి చేస్తే త్వరగా మాతృత్వం వస్తే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని! యువతుల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచితే దానిని నివారించవచ్చుననీ!! వాస్తవానికి మాతాశిశు మరణాలు(Maternal Deaths), బాలికల్లో రక్తహీనత (Anemia), పోషకాహార లేమి (Malnutrition) అనేవి ప్రభుత్వ పాలసీలతో ముడిపడి ఉన్న అంశాలు. వీటికి ఉద్దేశించిన నిధులను కేంద్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తగ్గించుకుంటూ వస్తున్నది.

మరోవైపు కీలకమైన ఆరోగ్య రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు అప్పగిస్తున్నది. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నా.. పేదలకు ఆహార భద్రత (Food Security)ను విస్తరించేందుకు అయిష్టత చూపుతున్నది. కానీ.. బాలిక ఆరోగ్యం, వారి వివాహ వయసుపై మాత్రం ఎక్కడలేని బాధ, ఆందోళన వ్యక్తం చేస్తున్నదని పలువురు నిపుణులు, మహిళా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఆరోగ్యం, విద్యపై వ్యయం పెంచడానికి బాధ్యత తీసుకోవడానికి నిరాకరిస్తున్న కేంద్రం పైగా.. యుక్త వయసు వచ్చిన మహిళల పునరుత్పత్తి హక్కులను (Reproductive Rights) ఆరోగ్యం పేరిట కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.