విధాత: జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షడు కే.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల ఎన్నికైన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సోమవారం పాతబస్తీలోని సాలర్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పదవులు ముఖ్యం కాదని, తోటి జర్నలిస్టులకు మేలు కలిగించే కార్యక్రమాలే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతూ స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఉద్భోదించారు. ఐజేయూ మాజీ అధ్యక్షులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి నాయకత్వాన్ని అందించిన ఘన చరిత్ర హెచ్.యు.జేకి ఉందన్నారు.
తామంతా huj నాయకత్వ స్థాయి నుంచి ఎదిగిన వారమేనని అమర్ స్పష్టం చేశారు. టీయూబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలో hujకు ఉన్న పేరు, ప్రతిష్టతను కాపాడే దిశలో నూతన కార్యవర్గం కార్యక్రమాలు రూపొందించు కోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, వరకాల యాదగిరి, హాబీబ్ జిలానీ, బి.కిరణ్ కుమార్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(huj) అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్ తో పాటు నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని కమిటీ ఆ సందర్భంగా ప్రతిజ్ఞ చేసింది.
మాజీద్ కు ఫైజ్ మొహ్మద్ అస్ఘర్ అవార్డు
యూనియన్ సీనియర్ నాయకుడు, సుప్రసిద్ధ ఉర్దూ పాత్రికేయుడు ఫైజ్ మొహ్మద్ అస్ఘర్ స్మారక అవార్డును ఐజేయూ నాయకుడు ఎం.ఏ.మాజీద్ కు పాతబస్తీ జర్నలిస్టుల సంఘం అందించి ఘనంగా సత్కరించింది.