హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!

హైదరాబాద్‌ నగరాన్ని మరింత విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముమ్మర కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తున్నది

హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
  • 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనంతో ఒకే కార్పొరేషన్‌?
  • 4 కార్పొరేషన్ల ఏర్పాటుపైనా యోచన
  • సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన
  • గ్రేటర్ సిటీలో అన్ని ప్రాంతాల ఏకరీతి అభివృద్ధి లక్ష్యం
  • అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశాలు!

విధాత : హైదరాబాద్‌ నగరాన్ని మరింత విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముమ్మర కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి, హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


అదే సమయంలో హైదరాబాద్‌ను నాలుగు భాగాలు చేసి, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగరాలుగా నాలుగు కార్పొరేషన్లుగా మార్చాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. హెచ్‌ఎండీఏ పరిధిని అన్ని వైపులా రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకూ విస్తరించాలని ఇటీవలే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్‌గా చేయడమా? లేక నాలుగు యూనిట్లుగా నాలుగు కార్పొరేషన్లు చేయడమా? అనే అంశంలో ముఖ్యమంత్రి యోచిస్తున్నారని సమాచారం.


పదవీకాలం ముగియగానే ప్రత్యేకాధికారుల పాలన!


ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలాలు పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించడం, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించడంపై మున్సిపల్ శాఖ అధికారులతో ఇటీవలే ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. దీంతో న్యాయపరమైన ఇబ్బందులేవీ తలెత్తకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేయడమా? లేక నాలుగు కార్పొరేషన్లు చేయడమా? అనే అంశంలో కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మున్సిపల్‌ అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారని విశ్వసనీయంగా తెలిసింది.


నిధుల పంపిణీలో సమతుల్యత కోసం


జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్నింటిలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. మరోవైపు సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.


ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లలో తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారని సమాచారం.


సమాన జనాభాతో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ


ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఢిల్లీ మోడల్‌ పరిశీలన


దేశ రాజధాని ఢిల్లీలో రెండేండ్ల కిందటే అక్కడున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖ అడిగి తెలుసుకున్నారని సమాచారం. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్‌ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితోపాటు ఓఆర్‌ఆర్‌ లోపల 30 మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి.