విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తాను చెప్పలేదని, ఢిల్లీలో పొత్తులపై చేసిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీమంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాదుకు చేరుకున్న వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. రాహుల్ గాంధీ పొత్తులపై చేసిన వ్యాఖ్యలనే తాను చెప్పానన్నారు.
తన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. వాటి ఆధారంగా తమ సొంత పార్టీలోని చిన్నచిన్న నాయకులు కూడా అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారన్నారు.
సెక్యులర్ పార్టీలతో తప్ప, బిఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ గాంధీ వరంగల్‌లో చెప్పిన వ్యాఖ్యలనే తాను రిపీట్ చేశానన్నారు. నా వ్యాఖ్యలు అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతాయని అన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇలా ఉంటదని కొన్ని సర్వేల ఆధారంగా మాత్రమే తాను ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలపై మాట్లాడటం జరిగిందన్నారు.
తనపై చర్యలు తీసుకోవడానికి తాను ఏ కమిటీల్లో లేనన్నారు. గడ్కరితో హైదరాబాద్ విజయవాడ రోడ్డు సమస్య పై మాత్రమే మాట్లాడానని, రాజకీయాలు చర్చించలేదన్నారు.