KCRకు కృతజ్ఞతతో.. ఆ రోజు వరకు చెప్పులు వేసుకోను: మంత్రి సత్యవతి ప్రతిజ్ఞ
Satyavathi Rathod/ విధాత: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ నాయకుడు.. సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన పరిపాలకుడు. ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని చేజిక్కించుకుని, చరిత్ర సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్ సైన్యం. మరి ఆ సైన్యంలో ఓ మంత్రి కూడా భాగస్వామం అయ్యారు. మరి ఆ మంత్రి ఎవరంటే.. సత్యవతి రాథోడ్. కేసీఆర్ మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టే వరకు చెప్పులు ధరించనని […]

Satyavathi Rathod/ విధాత: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ నాయకుడు.. సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన పరిపాలకుడు. ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని చేజిక్కించుకుని, చరిత్ర సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్ సైన్యం. మరి ఆ సైన్యంలో ఓ మంత్రి కూడా భాగస్వామం అయ్యారు. మరి ఆ మంత్రి ఎవరంటే.. సత్యవతి రాథోడ్. కేసీఆర్ మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టే వరకు చెప్పులు ధరించనని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచే చెప్పులు ధరించడం లేదని, ఎస్టీల పట్ల గొప్ప మనసు చాటుకున్నందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని రాథోడ్ తెలిపారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి తన కాళ్లకు చెప్పులు వేసుకోకుండా కనిపించారు. దీంతో మంత్రిని మీడియా సంప్రదించగా.. ఈ విషయం బయట పడింది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఇది నా ప్రతిజ్ఞ. దీని గురించి ఎవరికి తెలియొద్దు అనుకున్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. తెలంగాణ ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్ని కేసీఆర్ కల్పిస్తున్నారు. ఆయనే సీఎంగా కొనసాగాలని గట్టిగా కోరుకుంటున్నాను.
బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ మాత్రమే న్యాయం చేయగలరు. కేసీఆర్ పరిపాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసే వరకు నేను చెప్పులు ధరించకూడదని ప్రతిజ్ఞ చేశాను అని మంత్రి చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పుడు నా హృదయం చలించిపోయిందని రాథోడ్ పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించకూడదని నిర్ణయం తీసుకున్నాను.
నా వ్యక్తిగత హోదాలో కేసీఆర్ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలనే సంకల్పంతో ఈ దీక్షకు శ్రీకారం చుట్టానని సత్యవతి రాథోడ్ తెలిపారు. తాను 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకుని, మంత్రి పదవి కట్టబెట్టారని సత్యవతి రాథోడ్ భావోద్వేగానికి లోనయ్యారు.
రాజకీయాల్లో, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా పట్టించుకోరు. కానీ కేసీఆర్ తనకు మంత్రిగా అవకాశం కల్పించారు. జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని సత్యవతి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పుకునేందుకు ఇదే సరైన మార్గమని తనకు తోచిందన్నారు సత్యవతి రాథోడ్.