ICEA | పదేళ్లలో 21 రెట్లు అధికం.. భారీగా పెరిగిన మొబైల్స్ తయారీ విలువ..!

ICEA : భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీ విలువ భారీగా పెరిగింది. కేవలం పదేళ్లలో 21 రెట్లు అధికమై రూ.4.1 లక్షల కోట్లకు చేరింది. ‘ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA)’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం లాంటి ప్రభుత్వ విధానాలు.. దేశీయంగా మొబైల్స్ తయారీ చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు ఉపకరించాయని ICEA తెలిపింది.
దేశీయ గిరాకీలో 97 శాతం మొబైల్స్ స్థానికంగానే తయారవుతున్నాయని ఐసీఈఏ వెల్లడించింది. 2023-24లో ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిలో 30 శాతం ఎగుమతి కోసమేనని తెలిపింది. 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరిందని పేర్కొంది. 2015 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతుల విలువ రూ.1,556 కోట్లు మాత్రమేనని, 2023-24 చివరకు ఆ విలువ రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అంటే దశాబ్ద కాలంలో 7,500 శాతం పెరిగినట్లని వివరించింది.
స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెరగడంలో యాపిల్, శాంసంగ్ కీలక పాత్ర పోషించాయని ICEA తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, పశ్చిమాసియా, ఉత్తర, దక్షిణ అమెరికా మార్కెట్లకు అధికంగా ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లు ఐదో స్థానానికి చేరాయని పేర్కొంది. 2017 మేలో మొబైల్ ఫోన్ల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దశలవారీ తయారీ కార్యక్రమం (PMP)’ను ప్రకటించింది.
దాంతో భారత్‌లో ఒక బలమైన స్వదేశీ మొబైల్ తయారీ వ్యవస్థ నిర్మితమైంది. 2014లో కేవలం రెండు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా అవతరించింది. మరోవైపు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్ వంటి కంపెనీలు భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.