Telangana | అంతాబాగుంటే.. ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడుతారు? CM KCR సర్‌

విధాత‌: తెలంగాణ (Telangana)లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, వ్యవసాయ అనుకూల విధానాలు, చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల నిర్మాణాలతో దేశానికే ఆదర్శమని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. బీఆర్‌ఎస్‌ విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇవన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. కానీ సీఎం కేసీఆర్‌ నాగర్ కర్నూల్‌ సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. విద్యుత్ 24 గంటల సరఫరాతో తెలంగాణ వెలిగిపోతున్నదని, ఆంధ్రప్రదేశ్‌ చిమ్మ చీకట్లు […]

Telangana | అంతాబాగుంటే.. ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడుతారు? CM KCR సర్‌

విధాత‌: తెలంగాణ (Telangana)లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, వ్యవసాయ అనుకూల విధానాలు, చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల నిర్మాణాలతో దేశానికే ఆదర్శమని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. బీఆర్‌ఎస్‌ విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇవన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. కానీ సీఎం కేసీఆర్‌ నాగర్ కర్నూల్‌ సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

విద్యుత్ 24 గంటల సరఫరాతో తెలంగాణ వెలిగిపోతున్నదని, ఆంధ్రప్రదేశ్‌ చిమ్మ చీకట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో ఏపీ తెలంగాణ రాష్ట్ర దరిదాపుల్లోనే లేదని గతంలో అనేకసార్లు చెప్పారు. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంతో పోలిక ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్‌ హయాంలో దళారులు, పైరవీకారులదే భోజ్యమని, మళ్లీ ప్రజలను మింగేయడానికి వాళ్లు మాయ మాటలు చెబుతున్నారు. ధరణి ద్వారా రైతుకే అధికారం ఇచ్చామని, దీని ద్వారా 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. నిజంగా ప్రభుత్వం ధరణి పోర్టల్‌ గొప్పదని భావిస్తే గ్రామాలకు వెళ్లి రైతుల అభిప్రాయాన్ని సేకరించాలి.

గతానికి ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి? కొత్తగా తెచ్చిన రెవెన్యూ విధానంతో అవినీతి తగ్గిపోయిందా? పెరిగిందా? నిజంగా రైతులకు ధరణితో మేలు జరిగిందా? అన్న అనే ప్రశ్నలకు ప్రభుత్వానికి స్పష్టమైన సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు.

నాగర్‌కర్నూల్‌ సభ ద్వారా సీఎం ప్రస్తావించిన రెండు అంశాలను ప్రధానంగా పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం కేసీఆర్‌లో కనబడలేదని అంటున్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నదన్న ఆయన ఇంతటి సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం చెప్పినట్టు అంతా బాగుంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని సీఎం మాటల ద్వారా తేలిందంటున్నారు. అంతెందుకు దళితబంధులో కొందరు కమీషన్‌ తీసుకున్నట్టు తన దృష్టికి వచ్చిందని సీఎం బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరి తమ ప్రభుత్వంలో పైరవీలు, అవినీతికి ఆస్కారం లేదని ఎలా సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారు అని నిలదీస్తున్నారు.

వృత్తి కులాలకు రూ. లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. వృత్తి కులాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమే. అయితే కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని గత రెండు మేనిఫెస్టోలో పేర్కొన్నది. అది అమల్లోకి రాలేదు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం దగ్గర నిర్దిష్ట కార్యాచరణ లేదని విద్యావేత్తలు ఆక్షేపిస్తున్నారు. విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం అట్టడుగున 31వ స్థానంలో ఉన్నదన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

బలహీన వర్గాలను విద్యను దూరం చేసే వృత్తి కులాలకు లక్ష రూపాయలు ఇచ్చే కంటే ఆ పెట్టుబడి ప్రభుత్వం వాగ్దానం చేసిన కేటీ టు పీజీ ఉచిత విద్యపై పెట్టాలని వారు సూచిస్తున్నారు. దీంతో ఆ విద్యార్థులే ఔత్సాహిక వ్యాపారవేత్తలై ఆర్థిక సామాజ్రాలను సృష్టించి.. ఇంకా చాలామందికి ఉద్యోగాలు కల్పిస్తారని చెబుతున్నారు. కాబట్టి ఎన్నికల ఏడాది కాబట్టి ఆయా వర్గాల ఓట్లను దక్కించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వకుండా తొమ్మిదేళ్ల కిందట కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీపై దృష్టి సారించాలని కోరుతున్నారు.