‘ఇండియా’ అధికారంలోకి వస్తే 50% పరిమితి ఎత్తేస్తాం
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే రిజర్వేషన్ కోటా పరిమితి 50శాతాన్ని ఎత్తేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది

- రిజర్వేషన్లపై కాంగ్రెస్ కీలక హామీ
- ఓట్ల వేళ ఓబీసీనని చెప్పుకొనే మోదీ
- హక్కులు అడిగితే.. పేదలు, ధనికులు రెండు కులాలు అంటారు
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే రిజర్వేషన్ కోటా పరిమితి 50శాతాన్ని ఎత్తేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టర్‌ను ప్రదర్శించింది. తాము అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దనే పరిమితి ఎత్తేస్తామని సోమవారం రాహుల్‌గాంధీ కూడా ఒక సభలో ప్రకటించారు. అదే సమయంలో ఆదివాసీలు, దళితుల రిజర్వేషన్లను తగ్గించబోమని స్పష్టతనిచ్చారు. ‘నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నా.. సమాజంలోని వెనుకబడిన వర్గాలు తమ హక్కులు పొందుతాయి. సామాజిక, ఆర్థిక అన్యాయం అనేది అతిపెద్ద అంశం’ అని జార్ఖండ్‌లో మాట్లాడుతూ రాహుల్ చెప్పారు. ప్రధాని మోదీ తాను ఓబీసీనని చెప్పుకొంటూ ఉంటారని, కానీ.. కుల గణనకు డిమాండ్ చేస్తే ధనికులు, పేదలు అనే రెండే కులాలు ఉన్నాయంటూ దాట వేస్తారని విమర్శించారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులకు వారి హక్కులను వారికి ఇవ్వాల్సిన సమయం వస్తే.. కులాలనేవే లేవు అని మోదీ అంటారు. అదే ఓట్లు అడిగే సమయం వస్తే.. తాను ఓబీసీనని చెప్పుకొంటారు’ అని రాహుల్ అన్నారు.
1992లో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధించింది. అయితే.. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సెక్షన్ల ప్రజలకు వారి జనాభా ఆధారంగా మరిన్ని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఓబీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించేందుకు రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2021 మే నెలలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమానత్వ హక్కును 2018లో మహారాష్ట్ర తెచ్చిన చట్టం ఉల్లంఘిస్తున్నదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని విధిస్తూ 1992లో ఇచ్చిన తీర్పును తాము పునస్సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది.