Pak Woman |
అమర ప్రేమికురాలా? అజ్ఞాత గూఢచారా?
విధాత: తన ప్రియుడిని కలుసుకోవడానికి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ మహిళ సీమా హైదర్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో.. విలపిస్తూ తనకు తన ప్రేమికుడికి పెళ్లి చేయాలని ఆమె విన్నవించింది. ఆమె ప్రేమికుడు సచిన్ సింగ్, అతడి తండ్రి కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. తన పిల్లలను సైతం తనతో పాటు జైలులో ఉంచుకుంటానని ఆమె అభ్యర్థించగా కోర్టు అందుకు అంగీకరించింది.
భారత్‌లోకి ఇలా ప్రవేశించారు
హైదర్, ఆమె పిల్లలు నలుగురు మే రెండో వారంలో కరాచీ నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు విమానంలో చేరుకున్నారు. నేరుగా కాకుండా దుబాయ్ మీదుగా వచ్చినట్లు తెలుస్తోంది. ఖాట్మండులో దిగిన తర్వాత పొఖారా అనే ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి బస్సులో అయిదుగురూ దిల్లీ (Delhi) కి చేరుకున్నారు. మే 13న యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకి సమీపంలో ఉన్న సచిన్ సింగ్ స్వగ్రామం రబుపురాకు వచ్చేశారు.
పబ్‌జీ గేం ద్వారా వీరిద్దరికీ పరిచయం కాగా.. ఫోన్ నంబర్లు సైతం మార్చుకుని ఊసులాడుకున్నారు. అంతే కాకుండా మార్చ్‌లోనే నేపాల్‌లో వీరిద్దరూ కలుసుకున్నారని సమాచారం. అదే మీటింగ్‌లో ఇద్దరూ భారత్‌లో పెళ్లి చేసుకుని కాపురం చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పాక్ నుంచి భారత్ ఎలా రావాలనే అంశంపై ఇద్దరూ యూట్యూబ్, గూగుల్‌లో పలు మార్లు సెర్చ్ చేశారు.
అంతే కాకుండా భారత్‌కు రావడానికి తన పూర్వీకుల ఇంటిని రూ.12 లక్షలకు అమ్మేశానని సీమా పోలీసులకు చెప్పడం గమనార్హం. అన్నీ బాగానే జరిగినప్పటికీ వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఇటీవల లాయర్‌న ఆశ్రయించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది.
గూఢచారా?
ఈ కేసులో సీమాను గూఢచారి అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు బృందంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వెల్లడించారు. ఆమె 5వ తరగతి వరకు చదువుకున్నానని చెబుతున్నప్పటికీ ఇంగ్లీషు, హిందీల్లో ఆమె అనర్గళంగా సంభాషిస్తోందని తెలిపారు.
ఆమె ఇచ్చిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లూ పని చేయడం లేదని గుర్తించామన్నారు. ఆమె దగ్గర నుంచి ఏకంగా ఐదు సెల్‌ఫోన్లు, పాకిస్థాన్ నంబర్లు ఉన్న ఒక ఫోన్ బుక్ స్వాధీనం చేసుకున్నామని ప్రస్తుతం వాటిని ఫోరెన్సిక్ టీం పరిశీలిస్తోందని తెలిపారు.
2014లో జరిగిన తన మొదటి పెళ్లి వీడియో సీడీ, పాక్ పాస్‌పోర్టు, నలుగురు పిల్లల పాక్ గుర్తింపు కార్డులు, ఫ్లైట్ టికెట్‌లు మొదలైన వాటిని పోలీసులు సేకరించారు. ఆమె తన సిం కార్డు ఒకదాన్ని నేపాల్లో పడేసినట్లు వారు గుర్తించారు. సీమా ఒకప్పుడు పాక్‌లో పెద్ద టిక్‌టాక్ స్టార్. ప్రస్తుతం ఆమె ఆ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసినా.. కొన్ని వీడియోలను పోలీసులు సేకరించారు.
ప్రధాని గారూ మాకు పెళ్లి చేయండి..
మాకు పెళ్లి చేయాలని ప్రధాని మోదీని, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విన్నవించుకుంటున్నా. నేను ఏ తప్పూ చేయలేదు. సీమా పాకిస్థానీ కావడమే నేరమా? – సచిన్ సింగ్
నేను ఇక్కడే చనిపోతా
నాకు పాకిస్థాన్‌లో ఎవరూ లేరు. నన్ను కట్టుకున్నవాడు వదిలేసి ఏడాది అయింది. నేను ఏ తప్పూ చేయలేదు. ఇక్కడ చనిపోవడానికైనా సిద్ధమే. కానీ పాక్‌కు వెళ్లను – సీమా హైదర్