Global Corruption | మరింత దిగజారిన భారత్..అవినీతి సూచీలో 93వ స్థానం
గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్(అవినీతి సూచీ)లో భారత్ మరింత దిగజారింది. గతేడాది 85వ ర్యాంకులో నిలిచిన భారత్.. ఈసారి 93వ స్థానానికి పడిపోయింది

విధాత: గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్(అవినీతి సూచీ)లో భారత్ మరింత దిగజారింది. గతేడాది 85వ ర్యాంకులో నిలిచిన భారత్.. ఈసారి 93వ స్థానానికి పడిపోయింది. 2022లో 40 పాయింట్లు సాధించిన ఇండియా.. 2023లో 39 పాయింట్లకే పరిమితమైంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 2023 ఏడాదికి సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ ర్యాంకులను విడుదల చేసింది.
ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను తీసుకుని సున్నా నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయించి, ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇందులో సున్నాను అత్యంత అవినీతిగా, 100ను స్వచ్ఛమైనదిగా లెక్కకడుతూ స్కోర్ ఇచ్చారు. అంటే 100ను అవినీతి రహితమని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలిస్తే, రెండో స్థానంలో ఫిన్‌లాండ్ ఉంది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 71 శాతం దేశాలు అవినీతి సూచీలో 45 కంటే తక్కువ పాయింట్లతో ఉన్నాయని తెలిపింది.
ఈ ప్రాంతంలోని న్యూజిలాండ్ 3, సింగపూర్ 5వ ర్యాంకు సాధించాయి. పొరుగున ఉన్న చైనా 76వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 133, శ్రీలంక 115వ ర్యాంకుల్లో నిలిచాయి. మయన్మార్, ఆప్ఘానిస్తాన్ సంయుక్తంగా 162వ స్థానంలో ఉండగా, ఉత్తర కొరియా 172వ ర్యాంకులో నిలిచింది.