దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు 3 వేల మార్క్‌ను చేరుకున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు 3 వేల మార్క్‌ను చేరుకున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,997కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 2,669 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5,33,328కు చేరింది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి తర్వాత బీహార్‌లో తొలిసారిగా 2 కేసులు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జేఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేరళలో గడిచిన 24 గంటల్లో 265 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,606కు చేరింది. ఇందులో 21 జేఎన్.1 వేరియంట్ కేసులు ఉన్నాయి. ఇక జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. జేఎన్.1 వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరి చొప్పున మరణించారు.