Chandrayaan-3 | మరికాసేపట్లో నింగిలోకి చంద్రయాన్-3.. ప్రత్యేకతలివే..
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. చందమామను అందుకోవాలన్న ఇస్రో కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. నాలుగేండ్ల కిందట చెదిరిన జాబిల్లి కలను తిరిగి సాకారం చేసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం 3 ఎం 4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగం ద్వారా 2019లో(చంద్రయాన్-2) చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో […]

Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. చందమామను అందుకోవాలన్న ఇస్రో కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. నాలుగేండ్ల కిందట చెదిరిన జాబిల్లి కలను తిరిగి సాకారం చేసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం 3 ఎం 4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగం ద్వారా 2019లో(చంద్రయాన్-2) చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఉన్నారు.
ల్యాండర్ విజయవంతంగా కిందకు దిగేలా కసరత్తు..
బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు. అత్యంత శక్తివంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3ని ప్రయోగిస్తున్నారు. చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో కుప్పకూలిన అనుభావాలు, పొరపాట్లను దృష్టిలో ఉంచుకున్న ఇస్రో.. ఈసారి అనేక మార్పులు చేపట్టింది. ల్యాండింగ్ క్రమంలో వైఫల్యానికి ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, దాన్ని అధిగమించేలా(ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్) చంద్రయాన్-3ని రూపొందించింది. అనుకోని అవాంతరాలు ఎదురైనా ల్యాండర్ విజయవంతంగా కిందకు దిగేలా కసరత్తు చేపట్టింది.
మూడు మాడ్యూల్స్ సమన్వయంతో పని చేస్తేనే కల సాకారం..
చంద్రయాన్ -3లో ప్రధానంగా మూడు మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్. ఈ మూడు సమన్వయంతో పని చేస్తేనే ఇస్రో కంటున్న చందమామ దక్షిణ ధ్రువం కలలు సాకారం అవుతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను కూడా మోహరించారు.
చంద్రయాన్ -3 బరువు మొత్తం 3,900 కిలోలు కాగా, ప్రొపల్షన్ మాడ్యూల్ 2,148 కిలోలు, లాండర్, రోవర్ కలిపి 1,752 కిలోలు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 613 కోట్లు.
ప్రొపల్షన్ మాడ్యూల్ : రాకెట్‌ను నింగిలోకి తీసుకెళ్లే మాడ్యూల్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్‌గా పిలుస్తారు. ఈ మాడ్యూల్ రాకెట్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది. ఇది పెట్టె ఆకృతిలో ఉంటుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్షలోనే ఉంటూ ల్యాండర్‌కు భూకేంద్రానికి మధ్య కమ్యూనికేషన్ ప్రసార ఉపగ్రహంలా పని చేస్తుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ దీనికి బ్యాకప్‌గా వ్యవహరిస్తుంది.
ల్యాండర్ : ల్యాండర్ చంద్రుడి పైకి రోవర్‌ను మోసుకెళ్తుంది. దీనికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్లు ఏర్పాటు చేశారు. రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్ దిగగానే రోవర్ బయటకు వస్తుంది.
రోవర్ : ఇక చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్. ర్యాంప్ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడానికి దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్ కెమెరాలు అమర్చారు. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్ జీవితకాలం 14 రోజులు. రంభ-ఎల్పీ, సీహెచ్‌ఏఎస్టీఈ పరికరాలు వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను, నీటి జాడలను సీహెచ్‌ఏఎస్టీఈ గుర్తిస్తుంది.
40 రోజుల తర్వాత చంద్రుడి చెంతకు చంద్రయాన్-3
చంద్రుడిని 40 రోజుల తర్వాత చంద్రయాన్-3 చేరుకోనుంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. అనంతరం ల్యాండర్ భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36,500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. అంటే ఆగస్టు 23 లేదా 24వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కి.మీ. వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆక్షాంశం వద్ద దిగుతుంది. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలువు వేగం సెకనకు 2 మీటర్లు, హారిజాంటర్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూశారు. చందమామపై దిగేటప్పుడు ల్యాండర్ వేగాన్ని ఎప్పటికప్పుడూ నిర్దిష్టంగా కొలిచేందుకు, కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్ డాప్లర్ వెలోసీమీటర్ అనే పరికరాన్ని ఏర్పాటు చేశారు.
చంద్రయాన్-3 లక్ష్యాలు ఇవే..
చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం భారత్‌కు ఉందని చాటిచెప్పడం. జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయడం. చంద్రయాన్-3లోని పరికరాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం.
తొలిసారిగా 2008లో చంద్రయాన్-1 ప్రయోగం..
చందమామపైకి ల్యాండర్‌ను జారవిడిచే చంద్రయాన్ -1 ప్రయోగాన్ని 2008లో విజయవంతంగా నిర్వహించింది. చంద్రయాన్-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజుల పాటు పని చేసింది. చంద్రుడి ఉపరితలంపై నీటిజాడను తొలిసారిగా కనుగొని, భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి పడిలేచిన కెరటంలా ఎగసిన ఇస్రో.. లోపాలను సవరించుకొని తాజాగా చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది.
నాలుగో దేశంగా భారత్
చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ మాత్రమే విజయవంతంగా రోవర్లను దింపాయి. చంద్రయాన్-3 విజయవంతం అయితే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా, రష్యా, చైనాలు మూన్ మిషన్ కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు ఐదారు వందల కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపడుతున్నది.