త్వరలోనే నాసా శిక్షణకు భారత వ్యోమగాములు.. ఏడాది చివరలో ఐఎస్ఎస్‌కు ప్రయాణం!
సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్ మిషన్‌లో భాగంగా భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ 1984లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు

విధాత: సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్ మిషన్‌లో భాగంగా భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ 1984లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇది జరిగి నలభై ఏళ్లు కాగా మరోసారి భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టనున్నారు. అదీ ఈ ఏడాదిలోనే వాస్తవంలోకి వచ్చే అవకాశముంది. భారత్- అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వద్దకు నాసా పంపించుంది.
ఈ శిక్షణ నిమిత్తం కొందరు భారతీయ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌లు కొద్ది రోజుల్లో నాసా (NASA) కు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పయనమవ్వనున్నారని సమాచారం. ఇప్పటికి 20 దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్‌లను అమెరికా ఐఎస్ఎస్‌కు పంపించింది. భూమికి 400 కి.మీ. ఎత్తులో తిరుగుతూ ఉండే ఈ ల్యాబ్‌ను ప్రారంభించి ఇటీవలే 25 ఏళ్లు పూర్తయింది. ఐఎస్ఎస్ పర్యటన ద్వారా అంతరిక్షంలో ప్రయోగాలు ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా భారత వ్యోమగాములు తెలుసుకున్నట్లు అవుతుంది. అలాగే వచ్చే ఏడాది జరగబోయే మానవ సహిత గగన్‌యాత్రకు ఇది ఒక ముందస్తు శిక్షణలా ఉపయోగపడుతుంది.
రానున్న దశాబ్దం కాలంలో సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న భారత్‌కు ఈ ఐఎస్ఎస్ పర్యటన కీలకం కానుంది. మరోవైపు గగన్‌యాన్ యాత్రకు ఇస్రో ముమ్మరంగా సన్నద్దమవుతోంది. 2024ను గగన్‌యాన్ సంవత్సరంగా పేర్కొన్న ఇస్రో అధిపతి సోమనాథ్.. ఈ ఏడాది రెండు అబార్ట్ మిషన్‌లను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ పైలట్‌లు కొందరు రష్యాల్లో వ్యోమగామి శిక్షణను పూర్తి చేసుకుని వచ్చారు.
వీరిలో ముగ్గురు లేదా నలుగురిని గగన్‌యాన్ మిషన్‌కు తుది ఎంపిక చేస్తారు. ‘యూఎస్ మానవ సహిత యాత్రల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఈ యాత్రలను ఇప్పుడు అమెరికా చేపట్టడం లేదు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్, బోయింగ్ స్టార్ లైనర్ వంటి సంస్థలకు ఆ కాంట్రాక్టు ఇస్తోంది. ఈ తరహాలోనే భారత వ్యోమగామిని కూడా అమెరికా స్పాన్సర్ చేసి ఐఎస్ఎస్‌కు తీసుకెళుతుంది.ఈ శిక్షణ త్వరలోనే నాసాలో ప్రారంభమవుతుంది ‘ అని ఇస్రో అధిపతి డా.సోమనాథ్ అన్నారు.