ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ సంస్థ సీఎఫ్ఓ రాజీనామా లేఖ.. ప్రత్యేకత ఏమిటంటే..?
ఇంతకు ముందు ఏ లేఖ అయినా ఎవరికైనా పంపించాలంటే స్వదస్తూరితో తప్పులు లేకుండా అందంగా రాసి పోస్ట్‌లోనో నేరుగానో వారికి ఇచ్చేవాళ్లం

విధాత: ఇంతకు ముందు ఏ లేఖ అయినా ఎవరికైనా పంపించాలంటే స్వదస్తూరితో తప్పులు లేకుండా అందంగా రాసి పోస్ట్‌లోనో నేరుగానో వారికి ఇచ్చేవాళ్లం. జీమెయిల్, వాట్సప్‌లు వచ్చాక లేఖల అవసరమే తగ్గిపోయింది. ఏవో మరీ ప్రాముఖ్యం ఉన్న అవసరాలకే లేఖలు పరిమితమైపోయాయి. అదీ కూడా టైప్ తీసుకుని ప్రింట్ తీసే లేఖలే తప్ప స్వదస్తూరితో రాసేవి కాదు. కానీ ఓ సంస్థలో పనిచేసే ఉన్నతోద్యోగి (CFO Resignation Letter) తన రాజీనామా లేఖను స్వయంగా రాసి కంపెనీకి పంపించాడు.
ఆ రాసింది కూడా ఏ4 సైజ్ తెల్లకాగితంపై కాకుండా.. చిన్న పిల్లల నోట్స్‌లో ఉండే రూళ్ల కాగితంపై రాసి పంపించాడు. సీతురామన్ ఎన్ ఆర్ అనే వ్యక్తి ఎక్స్‌లో ఈ లేఖను పోస్ట్ చేయగా కొద్ది నిమిషాల్లో అది వైరల్ అయిపోయింది. లేఖ ఆధారంగా ఆ ఉద్యోగిపేరు రింకూ పటేల్. ఆ కంపెనీ పేరు మిత్షి ఇండియా కాగా అందులో రింకూ.. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) హోదాలో పనిచేస్తున్నారు.
ఇంత కీలకమైన స్థితిలో ఉండి ఈ అధికారి ఇలా లేఖ రాయడం విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు. తొలుత ఈ లేఖ మిత్షి ఇండియాకు అక్కడి నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు వచ్చింది. అక్కడి వారే దీనిని నెట్‌లో పెట్టి ఉంటారని తెలుస్తోంది. ఈ నెల 15న రింకూ తన రాజీనామాను ఇవ్వగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ సీఎఫ్ఓ తన పిల్లల నోట్స్ నుంచి ఒక రఫ్ పేజీని చింపి ఈ లేఖ రాసినట్లు ఉందని.. దీనిని నెట్‌లో పెట్టిన వ్యక్తి వ్యంగ్యంగా రాసుకొచ్చారు. రాజీనామాకు తన వ్యక్తిగత కారణాలే దారి తీశాయని.. సంస్థలో ఇన్ని రోజులు పనిచేసినందుకు కృతజ్ఞుణ్ని అంటూ రింకూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అందులో ఉన్న రైటింగ్‌ను బట్టి అది ఎవరో పిల్లలు రాసిందేనని. దానినే రింకూ తన రాజీనామా లేఖగా పెట్టారని కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే ఈ లేఖను కార్పొరేట్ సంస్థలు అంగీకరిచవని.. కచ్చితంగా ఫార్మాట్‌లోనే పంపాలని కొందరు పేర్కొన్నారు. ఏదేమైనా ఇది బాంబే ఎక్స్ఛేంజ్‌కు చేరుకుంది కాబట్టి కంపెనీ దీనిని అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని మరికొందరు రాసుకొచ్చారు. మిత్షి ఇండియా.. డేరా బ్రాండ్‌తో పెయింట్లు, కెమికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1976లో ఏర్పాటైన ఈ సంస్థ బాంబే ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది.