TSPSC |
గ్రూప్-2 వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆగస్టులో 21 పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయిదా వేయాలని పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు పలు వాదనలు వినిపించారు. గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లన్నీ చేశామని, 1,535 పరీక్ష కేంద్రాలు కూడా సిద్ధం చేశామని తెలిపారు. గ్రూప్-2 రాసే వారందరూ ఇతర పరీక్షలు రాయట్లేదని టీఎస్‌పీఎస్సీ కోర్టుకు తెలిపింది. కొందరు రాసినా అవకాశం ఇవ్వాలి కదా అని హైకోర్టు అభిప్రాయ పడింది.
5 లక్షలకు పైగా దరఖాస్తు చేస్తే 150 మంది పిటిషన్ వేశారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుదారు లంతా పిటిషన్ వేయరు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. సోమవారం వరకు గడువు ఇవ్వాలని, టీఎస్ పీఎస్సీని సంప్రదించి నిర్ణయం చెబుతామని న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. నిరుద్యోగులు నిన్న టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులోనే గురుకుల పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు.
ఇదే విషయాన్ని టీఎస్‌పీఎస్సీ అధికారుల దృష్టికి గ్రూప్-2 అభ్యర్థులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేయడంతో.. పోలీసులు అభ్యర్థులను అరెస్టు చేశారు. స్వల్ప లాఠీఛార్జి కూడా చేశారు.