Vaman Rao Couple Murder Case : వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణకు సీబీఐ రంగప్రవేశం
వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలపై సీబీఐ రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించింది.

విధాత : తెలంగాణలో సంచలనం రేపిన న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు విచారణ కోసం సీబీఐ రంగప్రవేశం చేసింది. గురువారం సీబీఐ విచారణ బృందం వామన్ రావు దంపతుల హత్య జరిగిన కల్వచర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగలో వామన్ రావు ఇంటికి చేరుకుని తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. 2021 ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద వామన్ రావు దంపతుల హత్య జరిగింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు.
న్యాయవాది గట్టు వామన్ రావు, నాగమణి దంపతులు హత్య కేసును కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. వారి హత్య కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందని వామన్ రావు తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడంతో.. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది.