AP Inter results: ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేశారు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది.

AP Inter results: ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల

AP Inter results: ఏపీలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 70శాతం, ద్వితీయ సంవత్సరంలో 83శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మన మిత్ర వాట్సప్, మన బడి వెబ్‌సైట్స్‌లో ఫలితాలను చెక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 3 శాతం, రెండవ సంవత్సరంలో 5శాతం పాస్ పర్సెంటేజ్ పెరిగింది.

ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్‌లో నిలిచాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా పాస్‌ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలు మాత్రం ఆఖరున నిలిచాయి. అలాగే మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు టాప్ త్రీలో ఉండగా.. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి జిల్లాలు ఆఖరి వరుసలో నిలిచాయి.

విద్యార్థులకు శుభాకాంక్షలు
ఈ ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం సంతోషకరమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందన్నారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దన్నారు. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.