Budget 2024 | వాతల్లేవు కానీ.. కోతలున్నాయి
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటుకు సమర్పించింది.

- ఓటు బ్యాంకుపైనే కేంద్ర బడ్జెట్ దృష్టి
- అయినా.. వాటితో తక్షణ ఫలాలు అందవు
- పీఎంఏవైజీ కింద కొత్తగా మరో 2 కోట్ల ఇళ్లు
- ఐదేళ్లలో నిర్మిస్తామని నిర్మల వెల్లడి
- కోటి ఇళ్లకు 300 యూనిట్ల సౌర విద్యుత్తు
- ఆ పథకానికీ ఐదు సంవత్సరాల వ్యవధి
- పట్టణాల్లోని పేదలకు ఇళ్ల పథకం
- ఎప్పుడు తెస్తారో స్పష్టతనివ్వని కేంద్రం
- ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపుదారులకు నిరాశే
- ఆదాయం పన్ను స్లాబ్స్‌లో మార్పు లేదు
- పలు సక్షేమ పథకాలకు నిధుల్లో కోతలు
- విద్య, వైద్య రంగాలకు కేటాయింపుల్లో కోత
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల
- అభివృద్ధి పథకాల్లో తగ్గిన కేటాయింపులు
- నిరుద్యోగం మాటే లేని బడ్జెట్ స్పీచ్
- ఉపాధి కల్పనకు కేటాయింపులు లేవు
- రేగా పథకానికి 26వేల కోట్ల పెంపుతో సరి
న్యూఢిల్లీ : రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. ఇప్పటికే అయోధ్య రామాలయాన్ని నిర్మాణం కూడా పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించి.. ఓట్ల వేట మొదలు పెట్టిన బీజేపీ సర్కార్.. ఎన్నికలకు ముందు సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో నాలుగు కీలక సెక్షన్లయిన పేదలు, మహిళలు, యువత, రైతుల ఓట్లే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అత్యంత కీలకమైన ఉద్యోగస్తుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ఆదాయం పన్ను స్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే.. పైకి ఈ నాలుగు కీలక సెక్షన్లపై దృష్టి కేంద్రీకరించినట్టు పైకి కనిపిస్తున్నా.. ఆయా వర్గాలకు వివిధ రూపాల్లో చేయాల్సిన కేటాయింపుల్లో మాత్రం గణనీయంగా కోతలు పెట్టడం గమనార్హం.
అదే సమయంలో ప్రకటించిన పథకాల ఫలితాలు ఐదేళ్లకు గానీ అందే పరిస్థితి కనిపించడం లేదు. కొన్నిటికి కాలపరిమితిని కూడా ప్రకటించలేదు. దేశంలో నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకమైనదని అనేక సర్వేలు పేర్కొంటున్నాయి. కానీ.. నిరుద్యోగం అన్న మాటే నిర్మలా సీతారామన్ ఉపన్యాసంలో కనిపించలేదు. అదే విధంగా ప్రభుత్వం చెబుతున్న 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించే దిశగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పథకాలు కానీ, వ్యయ ప్రణాళికలు కానీ కనిపించలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇళ్లు కట్టిస్తామని చెబుతున్నా.. దానికి టార్గెట్ రాబోయే ఐదేళ్లుగా పేర్కొన్నారు.
కోటి ఇళ్లకు సౌర విద్యుత్తును అందించేదీ ఐదేళ్లకే. పట్టణ పేదలకు సంబంధించిన ఇళ్లు కొనుగోలు చేసేందుకు లేదా కట్టుకునేందుకు పథకం ప్రవేశపెడతామని చెప్పినా.. ఎప్పటిలోగా ఆ పథకాన్ని తీసుకొస్తారనే అంశాన్ని దాచి పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పథకాలైన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో 60వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు బడ్జెట్ అంచనాల్లో 86,000 కోట్లు చేశారు. అంటే.. పెంచింది 26వేల కోట్లు మాత్రమే. ఆయుష్మాన్ భారత్ కింద కేటాయింపులు మూడు వందల కోట్లు మాత్రమే పెంచారు.
పన్ను చెల్లింపుదారులకు లభించని ఊరట
ఎంతోకాలంగా ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఎదురుచూసిన స్లాబుల మార్పు విషయంలో మాత్రం నిర్మలమ్మ కరుణించలేదు. గత ఏడాది విధానమే కొనసాగుతుందని తెలిపారు. గత పదేళ్లుగా డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. రిటర్న్ ఫైల్ చేసేవారు 2.4 రెట్లు పెరిగినట్టు చెప్పారు. ఆదాయం పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు మద్దతు ఇస్తున్నారంటూ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసిందని చెప్పారు. కొత్త పన్నుల పథకం కింద రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదని చెప్పారు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడుల అవసరం ఉండదని అన్నారు.
అంతకు మించి ఆదాయం కలిగిన వారికి మాత్రమే స్లాబుల మేరకు పన్ను వర్తిస్తుందన్నారు. గతేడాది ప్రతిపాదించిన పన్ను విధానంలో ఆదాయం పరిమితి రెండున్నర లక్షల రూపాయలుగానే ఉంటుందని నిర్మల తెలిపారు. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎటువంటి భారం ఉండబోదన్నారు. ప్రస్తుతం ఉన్న దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను రేటు 30% నుంచి 22 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. నిర్దిష్టమైన కొత్త తయారీ కంపెనీలకు పన్నురేటు 15శాతం చేశామని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. 2024-25లో పన్ను ద్వారా ఆదాయం 26.02 లక్షల కోట్లు సమకూరుతున్నదని అంచనా వేస్తున్నటు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు 2025 మార్చి 31 వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు.
నాలుగు రైల్వే కారిడార్లు
ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్లను మెరుగుపర్చేందుకు ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్, నౌకాశ్రయాల అనుసంధాన కారిడార్లు, రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల కారిడార్లు.. మూడు ప్రధాన ఎకనమిక్ రైల్వే కారిడార్ కార్యక్రమాలను నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వీటి వల్ల తక్కువ ఖర్చుతోనే సరుకు రవాణా మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో రద్దీని తగ్గించడం వల్ల ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు కూడా మెరుగవుతాయని, భద్రత, ప్రయాణ వేగం పెరుగుతాయని తెలిపారు. సరుకు రవాణా ఖర్చును కూడా ఇవి తగ్గిస్తాయని చెప్పారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న యువతక ఇది స్వర్ణయుగమన్న నిర్మలాసీతారామన్.. 50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక సహాయం, పునర్ ఆర్థిక సహాయం అందించేందుకు వీలవుతుందని తెలిపారు. వీటికి అతి తక్కువ వడ్డీ లేదా అసలు వడ్డీయే లేకుండా ఆర్థిక సహాయం అందించవచ్చన్నారు. వర్ధమాన డొమైన్లలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ప్రైవేటు రంగాన్ని ఇది ప్రోత్సహిస్తుందని తెలిపారు. మన దేశ యువత, సాంకేతిక పరిజ్ఞానం శక్తులను ఏకం చేసే కార్యక్రమాలు ఇప్పుడు అవసరమని ఆర్థిక మంత్రి అన్నారు.
మరిన్ని వైద్య కళాశాలలు
ప్రస్తుతం ఉన్న హాస్పిటళ్ల మౌలిక వసతులను ఉపయోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రణాళికలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం తగిన సిఫారసులు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తామన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను చట్ట వ్యతిరేకమని ప్రకటించడం, లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించడం, పీఎం ఆవాస్ యోజన కింద 70 శాతం ఇండ్లను మహిళలకే కేటాయించడం వంటి చర్యలతో వారి గౌరవం పెరిగిందని చెప్పారు. సౌర విద్యుత్తును అందించేందుకు ఒక పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా కోటి ఇండ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును అందిస్తామని తెలిపారు.
2070 నాటికి నెట్ జీరో సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. పర్యాటకానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సానుకూల రూపాంతరం చెందిందని నిర్మల తన ఉపన్యాసం మొదట్లో చెప్పారు. పేదలు, మహిళలు, యువత, రైతులు, వారి అవసరాలు, ఆకాంక్షలు దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌లా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. తమ దృష్టి మొత్తం ‘సబ్ కా సాత్ సబ్‌కా వికాస్’పైనే ఉన్నదని తెలిపారు. జీడీపీకి కొత్త అర్థం చెప్పిన నిర్మల.. ‘ప్రభుత్వం జీడీపీ.. గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్..పై కూడా సమాన దృష్టిని పెట్టింది’ అని వివరించారు.
ఆరోగ్యం, విద్య వ్యయంలో కోతలు
ఆరోగ్యం, విద్య బడ్జెట్ కేటాయింపులు సాధారణంగా దేశానికి అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ లక్ష్యాలను కూడా చేరుకోలేదని సవరించిన అంచనాలు పేర్కొంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం విద్యారంగానికి రూ.1,16,417 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, చివరకు రూ.1,08,878 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యంపై బడ్జెట్‌లో రూ.88,956 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. రూ.79,221 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రధాన పథకాల్లో కోతలు
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రధాన పథకాల కేటాయింపులో కూడా ఇలాంటి కోతలు ప్రస్తుత బడ్జెట్‌లో ఉన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఉద్దేశించి అబ్రెల్లా స్కీమ్‌లో బడ్జెట్ అంచనాలు.. 9,409 కోట్లు ఉంటే.. సవరించిన అంచనాల్లో దానిని 6,780 కోట్లకు తగ్గించారు.
ఎస్టీలకు బడ్జెట్ అంచనాల్లో 4,295 కోట్లు పెడితే.. సవరించిన అంచనాల్లో దానిని 3,286 కోట్లకు తగ్గించారు. మైనారిటీల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. 2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 610 కోట్లు పెడితే.. సవరించిన అంచనాల్లో 555 కోట్లు చేశారు. ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి బడ్జెట్ అంచనాల్లో 2,194 కోట్లు ఉంటే.. దానిని సవరించిన అంచనాల్లో 1918 కోట్లు చేశారు.
ఆదాయం పన్నే రెండో అతిపెద్ద ఆదాయ వనరు
కేంద్ర ప్రభుత్వానికి రుణాలు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంటే.. రెండో అతిపెద్ద ఆదాయ వనరుగా ఆదాయం పన్ను నిలుస్తున్నది. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ వనరుల్లో 19 శాతంగా ఉన్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 17%, జీఎస్టీ ద్వారా 18% ఆదాయం వస్తుంటే.. రుణాల ద్వారా 28 శాతం ఆదాయం సమకూరుతున్నదని బడ్జెట్ పత్రాలు పేర్కొంటున్నాయి.