ఐఫోన్‌ లవర్స్‌కు పండగే..! ఆకర్షణీయమైన ఫీచర్లతో ఐఫోన్‌ 16..!

ఆపిల్‌ ఫోన్లకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. చాలా మంది ఐఫోన్‌కు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లతో పోలిస్తే ధరలు అందనంత ధర పలుకుతుంటాయి

  • Publish Date - January 26, 2024 / 05:27 AM IST

Apple iPhone | ఆపిల్‌ ఫోన్లకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. చాలా మంది ఐఫోన్‌కు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లతో పోలిస్తే ధరలు అందనంత ధర పలుకుతుంటాయి. అయినా, ఈ ఐఫోన్లకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ ఐఫోన్‌ 16 తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.


కొత్త సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిద్దడంతో పాటు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఓ బటన్‌ ప్యానెల్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ బటన్‌తో ఫోన్‌ లోపలికి వెళ్లకుండానే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రోటోటైప్‌లపై కొత్త బటన్‌ తీసుకురానున్నట్లు టిమ్ కుక్ నేతృత్వంలోని ఆపిల్ సంస్థ ప్లాన్‌ చేస్తున్నది. పరికరాన్ని అడ్డంగా పట్టుకుని త్వరగా చిత్రాలు, వీడియోలను తీయడంలో ఈ బటన్ సహాయపడనున్నట్లు తెలుస్తున్నది.


కెమెరా బటన్ ఫోన్‌కు కుడి దిగువన ఉండవచ్చని.. అంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫొటోలు, వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన ఐఫోన్ 15 సిరీస్‌లో మ్యూట్ బటన్‌ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్‌తో తీసుకువస్తుందని నివేదిక తెలిపింది. ఐఫోన్ 15 సిరీస్ మార్కెటింగ్ ప్రచారంలో యాక్షన్ బటన్ కీలక భాగం కాగా.. అదేవిధంగా వచ్చే కొత్త తరం ఫోన్లలో కొత్త కెమెరా బటన్ ఆపిల్‌కు కీలకంగా మారుతుందని నివేదిక వెల్లడించింది.


ఇదే విషయాన్ని గత సెప్టెంబర్‌లో మాక్రూమోర్స్‌ అనే సంస్థ సైతం పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్‌లో ‘ప్రాజెక్ట్ నోవా’ పేరుతో మరొక కెపాసిటివ్ బటన్ ఉండవచ్చని.. కొత్త కెమెరా బటన్ మెకానికల్‌కు బదులుగా కెపాసిటివ్ బటన్‌గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. కొత్త బటన్ సంప్రదాయ బటన్ మాదిరిగా మెకానికల్‌గా ఉంటుందని.. అయితే కొన్ని కెపాసిటివ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలిపింది.


టచ్, ప్రెజర్ రెండింటికీ పనిచేసేలా ఉంటుందని ది ఇన్ఫర్మేషన్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. కెమెరా జూమ్, ప్రెస్‌ని నియంత్రించేందుకు వినియోగదారులను ఎడమ, కుడికి స్వైప్ చేయడానికి అనువుగా ఉంటుందని సమాచారం. అయితే, దీనిపై ఆపిల్‌ స్పందించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఐఫోన్‌ 16 సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.