ఆదిత్య ఎల్1 మిషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో చైర్మన్..!
భారత దేశ తొలి సోలార్ మిషన్ అత్యంత కీలకమైన మైలురాయిని చేరింది. ఈ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు

Aditya L1 | భారత దేశ తొలి సోలార్ మిషన్ అత్యంత కీలకమైన మైలురాయిని చేరింది. ఈ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య ఎల్1 జనవరి 6న సాయంత్రం 4 గంటలకు ఎల్1 (Lagrange 1) పాయింట్ వద్ద ఉన్న హాలో కక్ష్యకు చేరుకుంటుందని, వాహకనౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఆదిత్య ఎల్1 ఇంజిన్‌ను నియంత్రిత పద్ధతిలో ఆపరేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ముంబయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ టెక్‌ఫెస్ట్ 2023లో గురువారం ఇస్రో చీఫ్ మాట్లాడారు. భూమి, సూర్య గ్రహాల గురుత్వాకర్షణ మధ్య సమతుల్యత ఉన్న ప్రాంతం ఎల్1 పాయింట్ అని, ఇది భూమికి 3.5లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఆదిత్య ఎల్1 మిషన్‌లోని ఆరు పేలోడ్స్‌ను చక్కగా పని చేస్తున్నాయని, డేటాను అందిస్తున్నాయన్నారు. ఎల్1 పాయింట్‌కి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు.
ఆదిత్య నౌకలోని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేసినంత కాలం అధ్యయనం చేస్తూనే ఉంటుందన్నారు. నిర్ణీత కక్ష్యలోకి చేరిన తర్వాత సూర్యుడి వాతావరణం, అయస్కాంత తుఫానులు, భూమిపై వాటి ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష నౌక కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు (CMEs), ఇంటర్‌ప్లానెటరీ అయస్కాంత క్షేత్రాల వంటి వివిధ దృగ్విషయాలపై సమాచారాన్ని సేకరింస్తుందన్నారు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీకి కీలకమైన డేటాను అందిస్తుందన్నారు.
చంద్రయాన్-3పై కీలక వ్యాఖ్యలు..
భారత మూన్ మిషన్ చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 గొప్ప విజయాన్ని సాధించిందన్న ఆయన.. పని చేసేందుకు చాలా విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. ల్యాండర్, రోవర్ 14 రోజుల తర్వాత మళ్లీ తన సేవలను అందిస్తుందని ఆశించామని, దాని సామర్థ్యం ద్వారా మేల్కొంటుందని ఆశించామని.. కానీ అది జరగలేదని చెప్పారు.
డేటాను సేకరించిన తరువాత, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై గాఢ నిద్రలోకి వెళ్లిందన్నారు. ఇప్పుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రజ్ఞాన్‌లోని అన్ని సిస్టమ్‌లను పరీక్షించినప్పుడు, అవి 14 రోజుల తర్వాత కూడా పని చేస్తున్నాయని, అయితే ప్రయోగశాలలో పని చేసే వ్యవస్థలు చంద్రుడి ఉపరితలంపై పనిచేయకపోవచ్చునన్నారు.
ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు..
ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించేందుకు వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించే ప్రణాళికపై భారత్ కసరత్తు చేస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. సైనికుల కదలికలను ట్రాక్ చేయడానికి, వేల కిలోమీటర్ల విస్తీర్ణంపై నిఘా ఉంచడానికి అదనపు ఉపగ్రహాలను వివిధ కక్ష్యలలో ప్రవేశపెట్టనున్నారు. సాంకేతికతకు అనుగుణంగా ఉపగ్రహాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.