ISRO | మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న వాతావరణ, విపత్తు హెచ్చరికల ఉపగ్రమైన ఇన్‌శాట్ 3డీఎస్ ఉప్రయోగ ప్రయోగం చేపట్టనున్నది

- 17న నింగిలోకి ఇన్‌శాట్ 3డీఎస్
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 ద్వారా వాతావరణ, విపత్తు హెచ్చరికల ఉపగ్రమైన ఇన్‌శాట్ 3డీఎస్ ఉప్రయోగ ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్‌ఎల్‌వీ 16 మిషన్ ఇన్‌శాట్ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్ణయించింది.
ఈ మిషన్‌కు ఎర్త్‌సైన్సెస్ మినిస్ట్రీ నిధులు సమకూరుస్తున్నది. ఈ ఇన్‌శాట్ 3డీఎస్ ప్రత్యేకంగా వాతావరణాన్ని పరిశీలించేందుకు రూపొందించిన అధునాతన శాటిలైట్. ప్రస్తుతం ఉన్న వాటికంటే మెరుగ్గా రూపొందించారు. హై క్వాలిటీ డేటా ఇవ్వనున్నది. వాతావరణ పరిశీలన కోసం 6ఛానెల్ ఇమేజర్, 19 ఛానల్ సౌండర్‌తో సహా అత్యాధినిక పేలోడ్స్‌ను ఉపగ్రహంలో ఏర్పాటు చేశారు. ఇన్‌శాట్ 3డీఎస్ డేటా రిటే ట్రాన్స్‌పాండర్ (DRT) వంటి అవసరమైన కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను కలిగి ఉన్నది. ఆటోమేటిక్ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల నుంచి డేటాలను స్వీకరించి.. అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బెకన్ ట్రాన్స్‌మిటర్‌ల నుంచి డిస్ట్రెస్ సిగ్నల్స్, అలర్ట్ డిటెక్షన్‌లను ప్రసారం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అధునాతన పేలోడ్‌లు, కమ్యూనికేషన్ ఫీచర్‌లతో ఇన్‌శాట్ డీఎస్ భూమి, సముద్ర ఉపరితాలను పర్యవేక్షించనున్నారు. విపత్తు హెచ్చరికల వ్యవస్థ కోసం విలువైన డేటాను అందిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసే సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది. ఇదిలా ఉండగా.. ఇన్ స్పేస్ గురువారం విడుదల చేసిన ఇంటిగ్రేటెడ్ లాంచ్ మేనిఫెస్టో ఫర్ 2023-24 అండ్ 2024-25 ప్రకారం రాబోయే రెండేళ్లలో ఇస్రో దాదాపు 30 ప్రయోగాలకు రూప కల్పన చేసింది.