సూర్యుడు ఎంతలా వెలిగిపోతున్నాడో..! తొలిసారి ఫొటోలు తీసి పంపిన ఆదిత్య ఎల్‌-1

సూర్యుణ్ని శోధించ‌డానికి భార‌త్‌ పంపిన ఆదిత్య ఎల్‌-1 త‌న ప‌ని మొద‌లుపెట్టింది. సూర్యుని మొత్తం ఉప‌రిత‌లం క‌న‌ప‌డేలా ఆదిత్య తీసిన చిత్రాల‌ను ఇస్రో పోస్ట్ చేసింది

సూర్యుడు ఎంతలా వెలిగిపోతున్నాడో..! తొలిసారి ఫొటోలు తీసి పంపిన ఆదిత్య ఎల్‌-1

విధాత‌: సూర్యుణ్ని శోధించ‌డానికి భార‌త్‌ పంపిన తొలి ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్‌-1 (Aditya L-1 ) త‌న ప‌ని మొద‌లుపెట్టింది. సూర్యుని మొత్తం ఉప‌రిత‌లం క‌న‌ప‌డేలా తొలిసారిగా ఆదిత్య తీసిన చిత్రాల‌ను ఇస్రో (ISRO) ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సూర్యుని (Sun) నుంచి వ‌చ్చే అల్ట్రావ‌యొలెట్ కిర‌ణాల సాయంతో ఈ ఫొటోల‌ను ఆదిత్య క్లిక్‌మ‌నిపించింది. సోలార్ అల్ట్రావ‌యోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ) అనే ప‌రిక‌రం ఈ ప‌ని చేసింద‌ని ఇస్రో వెల్ల‌డించింది. 200 నుంచి 400 నానో మీట‌ర్ల రేంజ్‌లో 11 విభిన్న ఫిల్ట‌ర్‌ల‌ను ఉప‌యోగించి ఈ చిత్రాల‌ను తీసింద‌ని తెలిపింది.


ఆదిత్య తీసిన ఫొటోల‌లో సూర్యునిపై ఉండే ప్ర‌ధాన‌మైన మూడు ర‌కాల ప్రాంతాల‌ను ఇస్రో మార్క్ చేసింది. అవి స‌న్‌స్పాట్స్‌, విప‌రీత‌మైన ఉష్ణాన్ని వెలువ‌రించే ప్రాంతాలు, కాస్త ప్ర‌శాంతంగా ఉండే ప్రాంతాలు అందులో ఉన్నాయి. బాగా చీక‌టిగా, స్త‌బ్దుగా ఉండేవి స‌న్‌స్పాట్స్ కాగా.. ఇవి సూర్యునిపై కాస్త ఉష్ణోగ్ర‌త త‌క్కువ‌గా ఉండే ప్ర‌దేశాలు. ఇక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు సుమారు 6500 ఫార‌న్‌హీట్ వ‌ర‌కు ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో ఇంత కంటే ఎక్కువే.


అయితే ఈ స‌న్‌స్పాట్స్ నుంచే సౌర తుపానులు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటినే క‌రోన‌ల్ మాస్ ఎజెక్ష‌న్స్ (సీఎంఈ) అని శాస్త్రవేత్త‌లు పిలుస్తారు. ఈ తీవ్ర‌త మ‌న భూమిపై కూడా ఉంటుంది. దీని కార‌ణంగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జియోమాగ్న‌టిక్ తుపానులు ఏర్ప‌డ‌తాయి. వీటి రాక‌ను ముందుగా ఎలా గుర్తించాల‌నే కోణంలో ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికే ఆదిత్య ఎల్‌-1 ను ప్ర‌యోగించారు. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లు ఉండ‌గా.. అందులో ఎస్‌యూఐటీ ప్ర‌ధాన‌మైన‌ది.


సెప్టెంబ‌రు 2న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌హరికోట నుంచి దీని ప్ర‌యోగం జ‌ర‌గ‌గా.. ప‌లు ద‌శ‌ల్లో విన్యాసాలు చేసుకుంటూ సూర్యునికి, భూమికి మ‌ధ్య‌లో ఉన్న ఎల్‌-1 పాయింట్‌కు ఆదిత్య చేరుకుంది. ఈ పాయింట్ చుట్టూ ప‌రిభ్ర‌మిస్తూ సూర్యునిపై అధ్య‌య‌నాన్ని కొన‌సాగిస్తోంది. ఇది మ‌న భూమి నుంచి 15 ల‌క్ష‌ల కి.మీ. ఉండ‌గా.. ఇక్క‌డి నుంచి సూర్యుణ్ని 24 గంట‌లూ శోధించే అవ‌కాశం ఉంటుంది.


గ్ర‌హ‌ణాల స‌మ‌యంలోనూ ఇబ్బందులు రావని శాస్త్రవేత్త‌లు తెలిపారు. ఈ పాయింట్‌ను గ‌ణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లాంగ్రేంజ్ క‌నిపెట్టారు. అందుకే దీనికి లాంగ్రేంజ్ పాయింట్ 1 అనే పేరును పెట్టారు. ప్ర‌స్తుతం ఆదిత్య లో ఉండే ఎల‌క్ట్రోమాగ్నెటిక్‌, పార్టిక‌ల్‌, మాగ్నిటిక్ ఫీల్డ్ డిటెక్ట‌ర్లు సూర్యుని వంచే క‌రోనా అల‌లు, సూర్యుని చుట్టూ ఉండే ఫొటో స్పియ‌ర్‌, క్రోమో స్పియ‌ర్‌ల‌ను అధ్య‌య‌నం చేస్తాయి.