BBC కార్యాలయాల్లో ఐటీ ‘సర్వే’ చేసింది వీటికోసమే!

BBC, IT విధాత: మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అయితే.. బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారులు చేస్తున్న పని.. కొండను తొలిచి.. ఎలుకను పట్టడమే అన్నట్టుంది. ‘ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ తీస్తారా?.. భయం లేదా?’ అని బెదిరించేందుకే ఐటీ అధికారులు బయల్దేరినట్టుంది. ఇంతకీ బీబీసీ కార్యాలయాల్లో ‘సర్వే’ అని చెబుతున్న సోదాల్లో ఐటీ అధికారులు చేసింది ‘కంప్యూటర్లలో సోదాలు’! అక్కడి ల్యాప్‌టాప్స్‌లో ‘పన్ను బ్యాచ్‌’ ఏ కీ వర్డ్స్‌తో సెర్చ్‌ చేశారో తెలుసా? ‘షెల్‌ […]

  • By: Somu    latest    Feb 15, 2023 11:26 AM IST
BBC కార్యాలయాల్లో ఐటీ ‘సర్వే’ చేసింది వీటికోసమే!

BBC, IT

విధాత: మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అయితే.. బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారులు చేస్తున్న పని.. కొండను తొలిచి.. ఎలుకను పట్టడమే అన్నట్టుంది. ‘ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ తీస్తారా?.. భయం లేదా?’ అని బెదిరించేందుకే ఐటీ అధికారులు బయల్దేరినట్టుంది. ఇంతకీ బీబీసీ కార్యాలయాల్లో ‘సర్వే’ అని చెబుతున్న సోదాల్లో ఐటీ అధికారులు చేసింది ‘కంప్యూటర్లలో సోదాలు’! అక్కడి ల్యాప్‌టాప్స్‌లో ‘పన్ను బ్యాచ్‌’ ఏ కీ వర్డ్స్‌తో సెర్చ్‌ చేశారో తెలుసా? ‘షెల్‌ కంపెనీ’, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్, ‘ఫారిన్‌ ట్రాన్స్‌ఫర్‌’.. ఇవీ!!

రెండో రోజూ కొనసాగిన సోదాలు

బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో మంగళవారం మొదలైన ఐటీ అధికారుల ‘సర్వే’ రెండో రోజు కూడా ఉదయం 11 గంటల నుంచి కొనసాగిందని తెలుస్తున్నది. ఈ ‘సర్వే’ సందర్భంగా అధికారులు.. అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. ఉద్యోగుల మొబైల్‌ ఫోన్లను కూడా తనిఖీ చేశారని తెలుస్తున్నది.

ఈ సందర్భంగా ‘షెల్‌ కంపెనీ’, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్, ‘ఫారిన్‌ ట్రాన్స్‌ఫర్‌’.. వంటి పదాలతో సెర్చ్‌ చేశారని కథనాలు వస్తున్నాయి. అయితే.. తమ సిస్టమ్స్‌లోని వార్తలు, వార్తా కథనాలకు సంబంధించిన మెటీరియల్‌ను ఇచ్చేది లేదని ఐటీ అధికారులకు బీబీసీ ఎడిటోరియల్‌ టీమ్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో ఐటీ అధికారులు బుధవారం మాట్లాడుతారని తెలుస్తున్నది.

కక్షసాధింపేనా!

సాధారణంగా ఏదన్నా ఫిర్యాదు అందితే దానిపై సోదాలకు, తనిఖీలకు రావటం చూశాం. కానీ.. ఈ సారి ‘షెల్‌ కంపెనీ’, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్, ‘ఫారిన్‌ ట్రాన్స్‌ఫర్‌’.. వంటి పదాలతో సిస్టమ్స్‌ను వెతకడం విచిత్రంగానే ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీని అపఖ్యాతి పాలు చేసిన గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ ఇటీవలే రెండు భాగాలుగా ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ అనే డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. కానీ.. కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే నిషేధించింది. సోషల్‌ మీడియాలో వాటి లింకులు ప్రసారం చేయరాదని హుకుం జారీ చేసింది.

ఈ చర్య తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అనేక యూనివర్సిటీల్లో పలు ప్రజాస్వామిక, అభ్యుదయ విద్యార్థి సంఘాలు ఆ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఈ గొడవ రగులుతున్న సమయంలోనే ఒక్కసారిగా పన్ను అధికారుల కన్ను బీబీసీపై పడటం రాజకీయ నిపుణులను పెద్దగా ఆశ్చర్యపర్చలేదు.

మోదీ డాక్యుమెంటరీ తదనంతర పరిణామాల్లో బీబీసీపైనా ఏదో ఒక కక్ష సాధింపు చర్యకు మోదీ ప్రభుత్వం పాల్పడుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో దిగిపోయారు. ఇది కొత్తేమీ కాదని, కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, ప్రధాని మోదీని గానీ మీడియా ప్రశ్నిస్తే జరిగేది ఇలాంటి దాడులేనని రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా ఖండనలు

బీబీసీ కార్యాలయాల్లో సోదాల నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొన్నది. ప్రపంచ మీడియా సంస్థలు బీబీసీ కార్యాలయాల్లో సోదాలను తీవ్రంగా ఖండించాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కూడా భారత ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది. అధికార పార్టీని విమర్శిస్తూ కథనం ప్రసారం చేసిన బీబీసీని వేధించేందుకు, భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.