న్యూఢిల్లీ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) యూనిట్లపై నెలకొన్న అనిశ్చితికి ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సెయిల్ ప్రైవేటీకరణ నిలిచిపోయినట్టున్నదని వ్యాఖ్యానించారు. ‘ఐదేళ్ల క్రితం మూడు సెయిల్ యూనిట్లు.. దుర్గాపూర్ అల్లాయిస్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్లను తెగనమ్మాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు వాటి ప్రైవేటీకరణ నిలిచిపోయినట్టు కనిపిస్తున్నది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నికరంగా ఉద్యమించిన కార్మికులకు, కాంగ్రెస్ వంటి పార్టీలకు ఇది నిస్సందేహంగా విజయమే’ అని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ కొన్నేళ్లు ఈ కంపెనీలు అనిశ్చితికి గురవడానికి మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులోని సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జైరారమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బిడ్డర్లను షార్ట్ లిస్టు చేసినప్పటికీ.. వారు తదుపరి ప్రొసీడింగ్స్‌కు ఇష్టపడలేదు. 2019లోనే దుర్గాపూర్‌లోని అల్లాయీస్ స్టీల్స్ ప్లాంట్ (ఏఎస్పీ)ని, 2022లో కర్ణాటకలోని భ్రదావతిలో ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణల ప్రయత్నాలను నిలిపివేశారు.
మరి విశాఖ ఉక్కు?
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే.. మరోసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కార్మికులు, ప్రజలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రోజుల తరబడి నిరసనలు సాగాయి. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని గతంలో వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. సెయిల్ యూనిట్ల ప్రైవేటీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంపైనా స్పష్టమైన ప్రకటన కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి.