మరోసారి తెరపైకి ‘జమిలి’ ఎన్నికలు

జ‌మిలి ఎన్నిక‌ల‌పై స‌ల‌హాలు ఇవ్వాలని కోరిన న్యాయ‌క‌మిష‌న్‌ ప్రాంతీయ పార్టీల‌ను అణ‌గ‌దొక్కేందుకే అని విప‌క్షాల‌ ఆరోప‌ణ‌ ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నిక అని నిన‌దిస్తున్న మోదీ విధాత: ప్రధాని నరేంద్రమోదీ తాను అనుకున్నదే వేదంగా ముందుకు పోదలచినట్లు కనిపిస్తున్నది. జమిలి ఎన్నికల విషయంలో గతంలో అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా.. తిరిగి ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తెస్తున్నారు. జమిలి ఎన్నికల విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీలను […]

  • By: krs    latest    Jan 24, 2023 11:54 AM IST
మరోసారి తెరపైకి ‘జమిలి’ ఎన్నికలు
  • జ‌మిలి ఎన్నిక‌ల‌పై స‌ల‌హాలు ఇవ్వాలని కోరిన న్యాయ‌క‌మిష‌న్‌
  • ప్రాంతీయ పార్టీల‌ను అణ‌గ‌దొక్కేందుకే అని విప‌క్షాల‌ ఆరోప‌ణ‌
  • ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నిక అని నిన‌దిస్తున్న మోదీ

విధాత: ప్రధాని నరేంద్రమోదీ తాను అనుకున్నదే వేదంగా ముందుకు పోదలచినట్లు కనిపిస్తున్నది. జమిలి ఎన్నికల విషయంలో గతంలో అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా.. తిరిగి ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తెస్తున్నారు. జమిలి ఎన్నికల విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీలను న్యాయకమిషన్‌ కోరటం దీనికి తార్కానంగా చెప్పవచ్చు.

మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ జమిలి ఎన్నికల దిశగా దేశాన్ని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా 2016నుంచీ మోదీ ఒకే దేశం.. ఒకే చట్టం.. అనటంతో పాటు ఒకే ఎన్నిక అంటూ.. నినదిస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. సువిశాలమైన దేశంలో లోక్‌ సభ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకే సారి ఉమ్మడిగా కలిపి నిర్వహించటం ఆచరణ సాధ్యం కాని పని అనే అభిప్రాయమున్నది.

అలాగే సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికల విధానం పూర్తిగా వ్యతిరేకమైనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ, రాజకీయ, ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉండాలన్నది ఏమీ లేదు. అనేక రాజకీయ, సామాజిక కారణాల నేపథ్యంలో ప్రభుత్వాలు పడిపోయి మధ్యంతర ఎన్నికలు నిర్వహించ వలసి వస్తున్నప్పుడు జమిలి ఎన్నికల నిర్వహణ ఆచరణ యోగ్యం కాదనే వాదన బలంగా ఉన్నది.

21వ న్యాయకమిషన్‌ ముందు జమిలి ఎన్నికల పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలు కూడా జమిలి ఎన్నికల నినాదం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని విమర్శించాయి.

ప్రాంతీయ పార్టీలను, ఇతర పార్టీలను అణగదొక్కే ప్రక్రియలో భాగమే జమిలి ఎన్నికలని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తిరిగి ఇప్పుడు 22వ న్యాయకమిషన్‌ తాజాగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు తెలపాలని కోరటం మోదీ అనుసరిస్తున్న వ్యక్తివాద, నియంతృత్వానికి నిదర్శనమని అంటున్నారు.