Janasena vs Jaggubhai
విధాత: వివాదాస్పద మాటలు అని ఎవరు ఎన్ని అంటున్నా పవన్ వెనక్కి తగ్గడం లేదు.. తనదారి తన తీరు తనది అంటూ అదే జోరు కొనసాగిస్తున్నారు. నిన్న కాళహస్తిలో సాయి అనే కార్యకర్తను చెంపమీద కొట్టిన అంజూ యాదవ్ అనే సీఐ తీరుకు వ్యతిరేకంగా అక్కడికే వెళ్లి ధర్నా చేస్తాను అని ప్రకటించిన పవన్ ఇక వెనక్కి తగ్గేది లేదు.. జనసేనకు జగ్గూభాయ్ కు మధ్య పోరాటం అని తేల్చేసారు.
తన పోరాటం నేరుగా జగన్ తోనే అని ఫిక్స్ అయిన పవన్ తన మీటింగుల్లో నేరుగా జగన్ జగన్ అంటూ ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇక అటు జగన్ ఐతే పవన్ పేరు కూడా పలకడానికి ఇష్టపడడం లేదు. దత్తపుత్రుడు లేదా ప్యాకేజి స్టార్ అంటూ పవన్ను వెక్కిరిస్తారు జగన్. ఇక ఇప్పుడు పవన్ సైతం గోదావరి జిల్లాల్లో వాలంటీర్ల మీద చేసిన దాడి ఇంకా కొనసాగిస్తున్నారు.
రాయలసీమలో తనకు పెద్ద క్యాడర్ లేదని మొదటి నుంచీ భావిస్తున్న పవన్ ఇప్పుడు సీఐ అంజూయాదవ్ ను వ్యతిరేకిస్తూ అక్కడ ధర్నాకు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి గత నెలన్నరగా ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం పవన్ చుట్టూరా తిరుగుతున్నాయి. పవన్ వర్సెస్.. వైసిపి సోషల్ మీడియా అన్నట్లుగా విమర్శల పరంపర సాగుతోంది. ఒకర్ని ఒకరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సందట్లో పాపం లోకేష్ పాదయాత్ర మరుగునపడిపోయింది.
కేవలం టిడిపి మద్దతుదారు అయిన మీడియాలో మినహా సోషల్ మీడియాలో ఎక్కడా లోకేష్ హడావుడి లేదు. చంద్రబాబు కూడా కాస్త వెనుకబడ్డారు అయితే తన ఉనికిని చాటుకునే యత్నంలో చంద్రబాబు బుధవారం కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఇక పవన్ ఐతే గతంలోకన్నా ఉత్సాహంగా కామెంట్స్ .. స్టేట్మెంట్స్ తో రాష్ట్రాన్ని వేడెక్కిస్తున్నారు. మొన్న వాలంటీర్లను ట్రాఫికర్స్ అని ఆరోపించాక అది పెద్ద బూమరాంగ్ అయింది.
కాపుయువత సైతం చాలామంది వాలంటీర్లు ఉండడంతో ఆ వర్గంలో సైతం పవన్ కు వ్యతిరేకంగా వాయిస్ వచ్చింది. దీంతో పవన్ ఒకడుగు వెనక్కి వేసి మీ జీతాలు ఐదు వేల నుంచి పది వేలకు పెంచే మనిషినే తప్ప మీ కడుపు కొట్టేవాడిని కాదు అంటూ నష్టనివారణ ప్రకటన చేసినా వాలంటీర్లలో కోపం ఇంకా ఉంది. మొత్తానికి ఏదోలా పవన్ ప్రజల్లో జనంలో ఒక సందడి తెచ్చారు.. ఈ గోల మధ్య పాపం లోకేష్ పాదయాత్ర ఏమైందో ఎవరికీ తెలీడం లేదు. అయన యాత్రా విశేషాలకు మీడియా ప్రాధాన్యం తగ్గింది.