భూకంపాల వల్ల మిగిలిన దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు.. జపాన్‌లో పదుల్లోనే.. ఏమిటీ రహస్యం?
భూకంపాలకు నిలయమైన తుర్కియేలో గతేడాది 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సుమారు 50 వేల మంది మరణించారు

విధాత: భూకంపాల (Earth Quakes) కు నిలయమైన తుర్కియే (Turkey) లో గతేడాది 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సుమారు 50 వేల మంది మరణించారు. 2015లో 7.8 తీవ్రతతో నేపాల్ వచ్చిన భూకంపం బారిన పడి 9 వేల మంది మరణించారు. అదే ఏడాది అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం రాగా 2 వేల మంది కన్నుమూశారు. అదే తాజాగా జపాన్ (Japan) లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం, తర్వాత స్వల్ప, ఓ మాదిరి స్థాయిలో 155 కంపనాలు వచ్చినప్పటికీ మరణాల సంఖ్య 60 లోపే పరిమితమైంది. భారీ భూ కంపాలను కూడా తట్టుకుని జపాన్ ఎలా ప్రజల ప్రాణాలను కాపాడుతోందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
జపాన్ భౌగోళికంగా భూకంపాలు తీవ్రంగా సంభవించే ప్రాంతంలో ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా కనిపించే ఈ ప్రాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాల్లో 20 శాతం ఏర్పడతాయి. వాటి తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 6కు పైనే ఉంటుంది. జపాన్‌లో చిన్నా చితకా భూకంపాలు కలిపి ఏడాదికి 2 వేల వరకు నమోదవుతాయి. వాటిలో ప్రజలపై ప్రభావం పడి.. మరణాలు సంభవించేవి పదుల సంఖ్యలో ఉంటాయి. ఒక వేళ ఇదే పరిస్థితి వేరే దేశంలో ఉంటే ఏడాదికి వందల మంది ప్రాణాలు కోల్పోయేవారు.
పక్కా ప్రణాళికతో విజయం..
భూకంపాలకు సంభవించి ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ, ప్రజలకు సూచనలు అందజేయడం వంటి వాటిల్లో ప్రపంచానికి జపాన్ ఓ ట్రేడ్‌మార్క్‌గా నిలిచింది. భౌగోళిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడం, తు.చ. తప్పని ప్రణాళిక, నిరంతర పరిశోధన మొదలైనవి జపాన్‌కు వెన్నెముకలా పనిచేస్తున్నాయి. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ ప్లేట్, సీ ప్లేట్‌ల మధ్య కూర్చున్న ఈ దేశం ఇన్న విపత్తులను తట్టుకుంటోందంటే ఇదే కారణమని చెప్పాలి. అంతే కాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరరు. ఇక్కడ కట్టే ప్రతి ఇల్లూ ప్రభుత్వం సూచించినట్లు భూకంపాన్ని తట్టుకునేలా ఉండాలి. జనావాసాల్లో భారీ భవంతులు నిషేధం.
అతి స్వల్ప కంపనాలను తట్టుకునేలా, అతి భారీ భూకంపాలనూ తట్టుకునే రీతిలో ఇళ్ల మోడల్స్ ఉంటాయి. కాబట్టి ఎంత భూకంపం వచ్చినా ఇల్లు నిలబడకపోవచ్చు.. కానీ అందులో ఉండేవారు మరణించే ప్రమాదం దాదాపుగా ఉండదు. అంతే కాకుండా ముందస్తు హెచ్చరికలు, గోల్డెన్ అవర్‌లో అలారంలు ఇవ్వడంలో జపాన్ చాలా ముందు ఉంటుంది. భూకంపం రావడానికి నిమిషాలు, కొన్ని సార్లు సెకన్ల ముందు కూడా అలారంలు మోగించే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. సునామీలు, భూకంపాల అలర్టులు, ప్రభుత్వ సూచనలు అందజేయడానికి ప్రతి జపనీయుడి ఫోన్‌లోనూ అలారం సిస్టం తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.
కాగా.. వారు ఉన్నప్రాంతంలో ఏదైనా భూకంపం వస్తుందని మెసేజ్ రాగానే ఫోన్‌లోని అలారం సిస్టం పెద్దగా జిషిన్ దేసు, జిషిన్ దేసు (భూకంపం వస్తోంది) అని అరుస్తుంది. ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే భూకంపాల గురించి, అవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. ఎప్పటికప్పుడు మాక్‌డ్రిల్స్ కూడా ఉంటాయి. కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా ప్రమాద సమయాల్లో ఉపయోగపడే పనులు చేసేలా ప్రతి పౌరునికి శిక్షణ ఉంటుంది. ప్రసిద్ధి చెందిన జపాన్ రైల్వేలో ట్రైన్‌లు కూడా సెస్మిక్ సెన్సర్లను కలిగి ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక సర్వైవల్‌ను కిట్‌ను ప్రభుత్వం అందిస్తుంది.
ఇందులో ప్రాథమిక చికిత్స మందులు, ఒక వాటఱ్ బాటిల్, నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు, గ్లోవ్స్, ఫేస్ మాస్క్స్, ఇన్సులేషన్ షీట్స్, ఫ్లాష్ లైట్‌లు, రేడియో మొదలైనవి ఉంటాయి. కొద్ది రోజుల క్రితమే ఉచితంగా ఆహారం, నీరు ఇచ్చే వెండింగ్ మెషీన్లు జపాన్ ప్రభుత్వం వాడుకలోకి తెచ్చింది. వీటిని విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా బాధితులను ఆదుకోవచ్చు. ఇందులో 300 కూల్‌డ్రింకు బాటిళ్లు, 150 ఆహార పదార్థాల కిట్లు ఉంటాయని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో ఇవి డబ్బులు వేస్తేనే పని చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు మాత్రం ఏ సాధారణ పౌరుడైనా ఆ మెషీన్‌ను అన్‌లాక్ చేస్తే ఉచితంగానే ఆహారాన్ని పొందొచ్చు.
భూకంపం వచ్చిందంటే సునామీ కూడా విరుచుకుపడే ప్రమాదం నూటికి తొంభై శాతం ఉంటుంది. అందుకే ఆ కోణంలోనూ జపాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దృఢమైన కోస్టల్ బారియర్లు, సీ వాల్స్, ముందు జాగ్రత్త అలారంలు మొదలైన వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన విపత్తులోనూ భూకంపం వచ్చిన గంటలోపే 1000 మందిని అప్పటి కప్పుడు పునరావాస శిబిరాలకు తరలించారంటే వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. జపాన్ ప్రభుత్వం చూపుతున్న చొరవ, అధికారులపై ప్రజలకున్న విశ్వాసం, వారి నిజాయతీల వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నా.. ఎన్ని సార్లు కూలబడినా.. ఈ దేశం లేచి ముందుకు వెళుతోందనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.