విధాత: ఈమధ్య కాలంలో మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ జగన్ను తరచూ మెచ్చుకుంటున్నారు. ఆయా సందర్భాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాల మీద జెడి బహిరంగంగానే మద్దతుగా మాట్లాడుతున్నారు. చట్టం.. నిబంధనలు ప్రకారం ఆయన అలా మాట్లాడుతున్నారో.. రాజకీయ ఉద్దేశంతోనో గానీ మొత్తానికి జెడి గారు జగన్ కు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
రోడ్ల మీద మీటింగులను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో1ని సైతం జేడీ స్వాగతించారు. ఆ జీవో మంచిదేనన్నారు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదకు వచ్చింది కదా.. తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గట్టి ఆరోపణలు చేస్తున్నారు.
తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. అందుకే తను11 సిమ్ కార్డులు వాడుతున్నానని.. తన మాటలు రికార్డ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిమీద కేంద్రానికి సైతం ఫిర్యాదు చేస్తాను అన్నారు. అయితే ఈ విషయంలో జెడి స్పందిస్తూ అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది అంత వీజీ కాదన్నారు.
ఇతరుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదని అన్నారు లక్ష్మీనారాయణ.. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రా వంటి అత్యున్నత ఏజెన్సీలకు మాత్రమే ఎవరి టెలిఫోన్నైనా ట్యాప్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవని స్పష్టం చేశారు.
ఈ ఏజెన్సీలు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయగలిగినప్పటికీ.. అయితే అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయగలదన్నారు.
అది కూడా కేంద్ర హోం కార్యదర్శి అనుమతితో మాత్రమేనని చెప్పారు. జాతీయ భద్రత అంతర్జాతీయ సంబంధాలు అనే రెండు విషయాల్లో మాత్రమే మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ జరుగుతుందని లక్ష్మీనారాయణ వివరించారు.