పాట్నా : బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇండియా కూటమికి నితీశ్ గుడ్‌బై చెప్పి, మళ్లీ ఎన్డీఏలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆర్జేడీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ.. ఆ సర్కార్‌కు స్వస్తి పలకనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మళ్లీ బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీహార్‌లో జేడీయూ -బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. దీంతో జనవరి 28న నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా, బీజేపీ సీనియర్ నాయకులు సుశీల్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
నితీశ్ కుమార్ 28వ తేదీన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన ఆ రోజు సీఎంగా ప్రమాణం చేస్తారనే వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. అదే రోజు మహారాణా జయంతి సందర్భంగా నిర్వహించబోతున్న పబ్లిక్ మీటింగ్‌లో కూడా నితీశ్ పాల్గొనబోతున్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
ప్రధాని మోదీని గద్దె దించాలనే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకొని, బీహార్‌లో బీజేపీ – జేడీయూ ప్రభుత్వం ఏర్పడితే.. ఇండియా కూటమి బీటలువారనుంది.
కూటములు మారడం ఇదే తొలిసారి కాదు..
నితీశ్ కుమార్ కూటములు మారటం, మద్దతు ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ఏ పార్టీ గెలిచినా.. అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్లు వ్యవహరించే ఆయన 2013 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు తన మిత్ర పార్టీలకు హ్యాండిచ్చారు.
1998 నుంచి బీజేపీ – జేడీయూ మధ్య పొత్తులు కొనసాగుతున్నాయి. అయితే 2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నితీశ్ పేరు కూడా వినిపించింది. కానీ మోదీ పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నితీశ్ 2013, జూన్ 16న ఎన్డీఏ కూటమి నుంచి తొలిసారిగా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ఒంటరిగానే పోటీ చేశారు. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోకపోవడంతో.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాఘట బంధన్‌ను ఏర్పాటు చేశారు. ఆ పార్టీల మద్దతుతో నాలుగోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.
ఇక తేజస్వీపై 2017లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని తేజస్వీని కోరగా, ఆర్జేడీ శాసనసభా పక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. చివరకు 2017, జులై 26న సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ప్రతిపక్ష బీజేపీతో పొత్తు పెట్టుకుని గంటల వ్యవధిలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
2019 జనరల్ ఎలక్షన్స్‌లో ఎన్డీఏ తరపున నితీశ్ కీలక ప్రచారం నిర్వహించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ 2022, ఆగస్టు 9న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాతి రోజే ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ కొనసాగుతున్నారు. విపక్షాలన్నీ కలిసి మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఏర్పాటులో నితీశ్ కీలకపాత్ర పోషించారు. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్న కారణంతో మరోసారి రూట్ మార్చేందుకు నితీశ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 8 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి.. చీటికిమాటికి పదవుల కోసం పార్టీ విధానాలను పక్కనపెట్టి వ్యవహరిస్తుండటంపై పార్టీలో అంతర్గతంగానూ వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.