రాముడిపై ఎన్‌సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. మరో వైపు దేశంలో రాముడి కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి

  • Publish Date - January 4, 2024 / 05:24 AM IST

Jitendra Awhad | అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. మరో వైపు దేశంలో రాముడి కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే కర్నాటకలో 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించి కర్నాటకలో ఓ వ్యక్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. 31 ఏండ్ల కింద‌టి కేసులో శ్రీకాంత్‌ పూజారిని ప్రభుత్వం అరెస్టు చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందుసేన కార్యకర్తలను కాంగ్రెస్‌ లక్ష్యంగా చేసుకుంటుందని బీజేపీ, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన నేత రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ నేత డాక్టర్‌ జితేంద్ర అవద్‌ రాముడిని మాంసాహారిగా అభివర్ణించారు. మహారాష్ట్ర షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాముడు శాకాహారి కాదని.. మాంసాహారేనన్నారు. 14 సంవత్సరాలు నివసించిన వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తాడని.. సది సరైందేనా కాదా? అంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూలతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్ని వాస్తవమని.. ఇంత పెద్ద స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు గాంధీజీ ఓబీసీ అనే విషయం వారికి (ఆర్‌ఎస్‌ఎస్‌) అంగీకారయోగ్యం కాదన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని ఆయన అన్నారు. ఎన్‌సీపీ నేత వ్యాఖ్యలుపై బీజేపీతో పాటు హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.