జోగయ్య దీక్ష.. కాపుల్లో కదలిక!
విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తాము ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దీక్షకు ఉపక్రమించడం ద్వారా కాపుల్లో నిప్పు రగిల్చారు. ఇది ఎటు దారి తీస్తుంది.. ఎట్నుంచి ఎటు పయనిస్తుందో ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గతంలో డిమాండ్ చేస్తూ జగన్ ప్రభుత్వానికి డిసెంబర్ […]

విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తాము ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దీక్షకు ఉపక్రమించడం ద్వారా కాపుల్లో నిప్పు రగిల్చారు. ఇది ఎటు దారి తీస్తుంది.. ఎట్నుంచి ఎటు పయనిస్తుందో ఇంకా ఎవరికీ అర్థం కాలేదు.
కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గతంలో డిమాండ్ చేస్తూ జగన్ ప్రభుత్వానికి డిసెంబర్ 30 తుది గడువుగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో పోలీసులు ఆయనను దీక్ష విరమించాలని కోరారు. అయితే జోగయ్య వినిపించుకోక పోవడంతో 400 మంది పోలీసుల భద్రత మధ్య జనవరి 1 రాత్రి ఆయనను పాలకొల్లులో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా ఆయన కూర్చున్న వీల్ చైర్ తో సహా అంబులెన్సు ఎక్కించారు. అక్కడ నుంచి ఆయనను అంబులెన్సులో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే హరిరామ జోగయ్య తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు తన దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. అదేవిధంగా జీవో నెంబర్ 60 రద్దు చేయాలని.. యాక్ట్14 15 అమలులోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
జనవరి 1 సాయంత్రం ఏడు గంటలకి తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని జోగయ్య ప్రకటించారు. అప్పటి నుంచి తాను నిరాహార దీక్షలో ఉన్నానని వెల్లడించారు. కాపు రిజర్వేషన్పై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై స్పందన లేదన్న ఆయన కాపు రిజర్వేషన్ల సాధన కోసం చావడానికైనా సిద్ధమంటూ ప్రకటించారు.
నరసాపురం గాంధీ బొమ్మల సెంటర్లో అనుమతి ఇవ్వకపోతే ఇంటి ఆవరణలోనే దీక్ష చేపడతానన్నారు. భగ్నం చేస్తే ఆసుపత్రిలోనైనా దీక్ష కొనసాగిస్తా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కాపులకు గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ఎత్తేసింది. పైగా కాపుల రిజర్వేషన్ తమ చేతుల్లో లేదని.. అది కేంద్రమే నిర్ణయించాలని ప్రకటించింది.