సీఎం రేవంత్‌తో పెట్టుడులకు విదేశీ పయనం: కేఏ పాల్

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్‌ను కలిసి పెట్టుబడులు తెచ్చేందుకు త్వరలో విదేశాలకు వెళ్లనున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చెప్పారు.

సీఎం రేవంత్‌తో పెట్టుడులకు విదేశీ పయనం: కేఏ పాల్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఏ.పాల్ ఆయన కోడలితో కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. అనుమతి లేదంటూ ఎంట్రీ వద్ద భద్రత సిబ్బంది వీరిని ఆపేశారు. కొంత సమయం తర్వాత అనుమతి రావడంతో సెక్రెటరీ ఛాంబర్‌లో కూర్చున్నారు.


ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పార్లమెంటు ఎన్నికల అనంతరం విదేశీ పర్యటనలకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారబోతుందన్నారు. తమ్ముడు రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. రేవంత్ ఇంగ్లీష్‌పై విమర్శలు చేయడం తెలివి తక్కువతనమన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా ఇంగ్లీష్ తెలియనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.


ఆక్టోబర్ 2న హైదరాబాద్‌లో గ్లోబల్ పీస్ సమ్మిట్ ఉంటుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ సమ్మిట్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదని కేఏ.పాల్ అన్నారు. కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తే.. రేవంత్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు.


బీఆరెస్‌ హయాంలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ.పాల్ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెలో అని, రూ.పది లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. చంద్రబాబు, జగన్‌లు కలిసి ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు.