కాళేశ్వరం పారించిన నీళ్లు.. ఓ కట్టు కథ.. కానీ.. అది ప్రజల ఆస్తి!

తెలంగాణాలో గత నాలుగయిదేళ్లలో సాగయిన భూమంతా కాళేశ్వరం వల్లనే సాగయిందనేది ఎంత అబద్దమో, కాళేశ్వరం బరాజు కుంగి పోవడం వల్లనే ఈ ఏడాది నీటి కరువు వచ్చిందని చెప్పడం అంతే అబద్ధం

కాళేశ్వరం పారించిన నీళ్లు.. ఓ కట్టు కథ.. కానీ.. అది ప్రజల ఆస్తి!

తెలంగాణాలో గత నాలుగయిదేళ్లలో సాగయిన భూమంతా కాళేశ్వరం వల్లనే సాగయిందనేది ఎంత అబద్దమో, కాళేశ్వరం బరాజు కుంగి పోవడం వల్లనే ఈ ఏడాది నీటి కరువు వచ్చిందని చెప్పడం అంతే అబద్ధం. నిజానికి కాళేశ్వరం ఇప్పటిదాకా ఉద్ధరించిందేమీ లేదు. నీటిపారుదల నిపుణునిగా చెప్పుకునే ప్రకాష్ అనే తలమాసినోడు కాళేశ్వరం కింద ఏటా 60 లక్షల ఎకరాలు సాగయినట్టు ఇటీవల రాశాడు. తెలంగాణ దారిద్య్రంపై సంధించిన జలాస్త్రం కాళేశ్వరమని ఎప్పటిలాగే భజన గీతం ఆలాపించారు. కాళేశ్వరం బరాజు నుంచి గత ఐదేళ్లలో ఎత్తిపోసిన మొత్తం నీళ్లే 160 టీఎంసీలు. అందులో 50 టీఎంసీలు మళ్ళీ గోదాట్లోకే వదిలారు. మిగిలిన 110 టీఎంసీలతో ఐదేళ్లలో మొత్తం సాగయ్యే భూమి మహా అయితే 10 లక్షల ఎకరాలు. అంటే ఏటా రెండు లేక రెండున్నర లక్షల ఎకరాలు మాత్రమే కాళేశ్వరం కింద సాగయినట్టు చెప్పుకోవాలి. అసలు విషయం ఏమంటే 2019 నుంచి 2023 వరకు మంచిగా కాలం అయింది. శ్రీరామ్ సాగర్ నాలుగేళ్లు పొంగి పొర్లింది. ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు శ్రీరామ్ సాగర్ వరద నీటితోనే నిండిపోయాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చిన్నా పెద్దా రిజర్వాయర్లు చెరువులు అలుగులు పోశాయి. ఆయకట్టు బాగా పెరిగింది. 

గోదావరి కింద ఉన్న జిల్లాల్లో మొత్తం వరి పండించే భూమే సుమారు 36 లక్షల ఎకరాలు. ఇందులో 6 లక్షల ఎకరాలు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద సాగు అవుతున్నట్టు చూపించారు. మిగిలింది 30 లక్షల ఎకరాలు. వానాకాలం, యాసంగి కలిపి కాళేశ్వరం కింద 60 లక్షల ఎకరాలు సాగవుతున్నట్టు కోటి ఇరవై లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నట్టు చెంచా మేధావులు, డబ్బా మీడియాలో ఊదరగొట్టించారు. అరవై లక్షల ఎకరాలు సాగవడం, కోటి ఇరవై లక్షల టన్నుల ధాన్యం పండించడం నిజమే, కానీ కాళేశ్వరం నీటితో కాదు శ్రీరామ్ సాగర్ నీటితో, ఉత్తర తెలంగాణలోని 14 లక్షల బోరుబావులు, ఇరవై వేల చెరువుల నీటితో. కేసీఆర్, ఆయన బానిసలు మాత్రం ఈ లెక్కలన్నిటినీ పాతరేసి కాళేశ్వరం డబ్బా కొడుతూ వచ్చారు. కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు అని, పెద్ద కుంభకోణమని రేపు ఎప్పుడయినా బయటపడితే జనానికి అర్థం కాకుండా చూడడం కోసం ఇదంతా చేశారు. 

కాళేశ్వరం నుంచి ఎత్తి పోసిన నీళ్ళెన్ని? పొలాలకు పారిన నీళ్ళెన్ని? అన్న లెక్కలు బయటపెట్టలేదు. నాలుగేళ్లలో ఏటా సగటున ౩౦ టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తి పోశారు. ముప్పై టీఎంసీల నీటితో యెంత భూమి పారుతుంది? ఎంత పంట వస్తుంది? కేసీఆర్, ఆయన బానిసలు మాత్రం ఈ లెక్కలన్నిటినీ పాతరేసి కాళేశ్వరం డబ్బా కొడుతూ వచ్చారు. కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు అని, పెద్ద కుంభకోణమని రేపు ఎప్పుడయినా బయటపడితే జనానికి అర్థం కాకుండా చూడడం కోసం ఇదంతా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చు గురించి ఎవరు ప్రశ్నించకుండా మాయ చేయడం కోసం బీబీసీ, నేషనల్ జాగ్రఫీ వంటి ఛానళ్లతో సినిమాలు తీయించి ప్రచారం చేశారు. మొదట జనం కూడా ఇదంతా కాళేశ్వరం గొప్పే అనుకున్నారు. ఇప్పుడు ఈ ఏడాది వర్షాలు సరిగా పడక పోవడమే కాదు కాళేశ్వరం- మేడిగడ్డ బరాజు కుంగడంతో వాస్తవ పరిస్థితి బయటడింది. 

ఇదీ అసలు విషయం. వ్యవసాయ శాఖ 2019 వరకు కాలువల కింద యెంత, చెరువుల కింద యెంత, బోరుబావులకింద యెంత సాగవుతుందో విడిగా లెక్కలు చెప్పేది. కేసీఆర్ యెంత మాయగాడంటే అరవయ్యేళ్ళుగా అనుసరిస్తున్న పద్దతిని బొందపెట్టి మొత్తం సాగుభూమిని కాళేశ్వరం ఖాతాలో వేయించుకున్నాడు. అరవై లక్షలు, డెబ్భై లక్షలు, కోటి ఎకరాలు అని లెక్కలు పెంచి జనాన్ని మోసం చేస్తూ పోయారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 906 మిల్లీమీటర్లు కాగా 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో 1033, 1323, 1181, 1387 మిల్లీమీటర్లు నమోదయింది. ‘మంచి వర్షాల కారణంగానే సాగు విస్తీర్ణం, వ్యవసాయ దిగుబడి బాగా పెరిగాయని’ గత ప్రభుత్వమే 2022-23 వార్షిక ప్రణాళికలో రాసుకున్నది. బోరు బావుల సంఖ్య తెలంగాణ వచ్చిననాడు 18 లక్షలు కాగా నేడవి 28 లక్షలకు పెరిగాయి. అంటే బోరుబావుల కింద కూడా సాగు భూమి బాగా పెరిగింది. కేసీఆర్, ఆయన బానిసలు మాత్రం అంతా కాళేశ్వరం ఖాతాలోనే వేసుకుంటూ పోయారు. కరువు అసలు గుట్టు బట్టబయలు చేసింది. 

ఈ ఏడాది(2023-24) వర్షపాతం 914 మిల్లీమీటర్లు. ఇది సాధారణ వర్షపాతం కిందే లెక్క. అయితే ఈ ఏడాది వర్షం అంతటా ఒక్క తీరుగ పడలేదు. కొన్ని జిల్లాల్లో వంద శాతం అధికంగా కురిస్తే సగానికిపైగా జిల్లాల్లో యాభై శాతం కూడా పడలేదు. కృష్ణ పరివాహక ప్రాంతంలో మరీ లోటు ఏర్పడింది. కరువు వాస్తవం. శ్రీశైలం, సాగర్ నిండలేదు. మొత్తం 46 వేల చెరువుల్లో సగం చెరువులు కూడా నిండలేదు. నిజానికి కాళేశ్వరం ఇప్పుడు కొంతయినా పనికి వచ్చేది. కానీ అది పుచ్చి బుర్ర అయింది. మేడిగడ్డ, అన్నారం బరాజులు రెండు పొక్కలు పడి పనికిరాకుండా పోయాయి. కేసీఆర్ చేసింది తప్పా ఒప్పా అన్నది తేల్చాలి. అదే సమయంలో ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకు రావాలి. కేసీఆర్ అత్యాశతో ప్రాజెక్టును రీడిజైన్ చేసి వేల కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడది ప్రజల ఆస్తి. దానిని అలా వదిలేయడానికి వీలు లేదు.