Kamareddy | నువ్వా.. నేనా: టికెట్ కోసం ముగ్గురు BRS నేతల బాహాబహి

Kamareddy టికెట్ రేసులో ఎమ్మెల్యే గంప గోవర్దన్, ముజీబ్, నిట్టు వేణుగోపాల్ ఆ ముగ్గురిదీ ఒకే పార్టీ… అంతే కాదు ఒకే మాట.. ఒకే బాట.. నిన్న మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నారు.. త్వరలోనే ఎన్నికలు రానుండడంతో వారు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ముందడుగు వేస్తున్నారు. విధాత, కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి నియోజక వర్గంలో […]

Kamareddy | నువ్వా.. నేనా: టికెట్ కోసం ముగ్గురు BRS నేతల బాహాబహి

Kamareddy

  • టికెట్ రేసులో ఎమ్మెల్యే గంప గోవర్దన్, ముజీబ్, నిట్టు వేణుగోపాల్

ఆ ముగ్గురిదీ ఒకే పార్టీ… అంతే కాదు ఒకే మాట.. ఒకే బాట.. నిన్న మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నారు.. త్వరలోనే ఎన్నికలు రానుండడంతో వారు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ముందడుగు వేస్తున్నారు.

విధాత, కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి నియోజక వర్గంలో మూడు ముక్కలాట నడుస్తోందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.. గులాబీ పార్టీని ఇరుకున పెట్టిన మాస్టర్ ప్లాన్ వివాదానికి కూడా నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.

ఒక్క గులాబీకి రెండు ముల్లులు అన్నట్లు తయారైంది నియోజకవర్గ పరిస్థితి.. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలిచింది. 5 సార్లు టిడిపి, 3 సార్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఈ ప్రాంతానికి ఎంతో రాజకీయ చైతన్యం ఉంది.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం ఊపిరిపోసింది.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుఓటములను శాసిస్తారు ఈ ప్రాంత రైతులు.. గతంలో నల్ల బెల్లంపై ఆంక్షల విషయంలోనూ సీరియస్ గా తీసుకున్న ఇక్కడి చెరుకు రైతులు ఎన్నికల్లో ప్రభావం చూపారు. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న గులాబీ పార్టికి ఈ సారి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మాస్టర్ ప్లాన్ వివాదం ఆ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ను ఇరకాటంలో పడేసిందన్న చర్చ జరుగుతోంది… రైతుల ఉద్యమంతో తప్పులు సరి దిద్దుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదన్న సమాచారం. రైతుల పోరాటంతో పట్టు వీడి దిగిరాక తప్పలేదు.

మాస్టర్ ప్లాన్ వివాదం ఇప్పుడు అధికార పార్టికి పెద్ద తల నొప్పికి కారణం అవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ విషయంలో సొంత పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యే గంపకు కుంపటి పెట్టె పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఒంటెద్దు పోకడలతో వివాదానికి కారణం అయ్యారని పార్టికి బాగా డ్యామేజ్ అయ్యిందని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు… పూడ్చుకోలేని నష్టం జరిగిందని అంటున్నారు.

మాస్టర్ ప్లాన్ రద్దు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అనేవాదన కూడా గులాబీనేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వరుసగా 3సార్లు గెలిచి వ్యతిరేకత మూటగట్టుకున్న గంపకు ఈ సారిచెక్ పెట్టేందుకు వ్యూహరచన తెరవెనుక చేస్తున్నట్టు సమాచారం.

ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబ్, ప్రధాన అనుచరుడు నిట్టు వేణుగోపాల్ టికెట్ రేసులో ఉన్నారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. అటు ముజీబ్ మాత్రం మైనార్టీ కోటాలో ఈసారి టికెట్ తనకే అంటున్నట్టు మైనార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది.

ఈ మేరకు పార్టీ పెద్దలు కేటీఆర్, కవితలకు దగ్గరయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతూ వీరితో టచ్ లో ఉన్నారు. ఒక వేళ సిట్టింగ్ను మార్చాల్సి వస్తే మొదటగా తన పేరే పరిశీలనకు వస్తుందనే ధీమాలో ఈ మైనార్టీ నేత ఉన్నారు.

మరో వైపు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరైన నిట్టు వేణుగోపాల్ కూడా నేను సైతం అంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 2012లో గంప గోవర్దన్ టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నిట్టు వేణు పోటీ చేశారు.

ఆ తరువాత గులాబీ పార్టిలో చేరి పోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు జాహ్నవిని మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తనకున్న పాత పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో నిట్టు వేణు ఉన్నారు.

కామారెడ్డి బల్దియా లో కూతురును చైర్మన్ చేయడం. ఆ పదవిని పూర్తి స్థాయిలో వాడుకుంటూ నియోజక వర్గంపై పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నారని ప్రచారం జోరందుకుంది. తనకంటూ ఓ వర్గాన్ని కూడాగట్టే పనిలో ఉన్నారు.

అయితే ఇటీవల మాస్టర్ ప్లాన్ వివాదాన్ని ఎమ్మెల్యే పై నెట్టేసే కుట్ర జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు దీన్ని అవకాశంగా తీసుకుని వచ్చే ఎన్నికల్లో గంపకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇదే జరిగితే తనకులైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు నిట్టు వేణు.

అయితే గంప మాత్రం మాస్టర్ ప్లాన్ వివాదంలోంచి బయట పడేందుకు పూర్తిగా మున్సిపాలిటీ పై నెట్టేసి తప్పించు కునేందుకు పావులు కదుపుతున్నారు. మాస్టర్ ప్లాన్ పాపం మున్సి పాలిటీ దే తనకేమీ తెలువదు అని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే.

ఇదిలా ఉంటె అటు గంప ఇటు నిట్టు నువ్వా నేనా అన్నట్లుగా తెరవెనుక రాజకీయాలు చేస్తుంటే ఈ ఇద్దరికి బదులు తనకు అవకాశం రాకపోతుందా అని మైనారిటీ నేత ముజీబ్ ఎదురు చూస్తున్నారు.
ఇద్దరు నేతల కదలికలను ఎప్పటికప్పడు అధిష్టానానికి చేరవేస్తూ పార్టీ పెద్దలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారట ఈ నేత. మొత్తంగా ముగ్గురి మధ్య ముడిపడదు అన్నట్లు గా కామారెడ్డి అధికారపార్టీ లో ఎన్నికలకు ముందే కోల్డ్ వార్ నడుస్తోందట.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకోవడంతో ఏ గ్రూప్తో జతకట్టాలో తెలియక క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఒక వెళ ఇదే జరిగితే ఓట్లు చీలిపోయి ప్రత్యర్థుల గెలుపుకు మార్గం సుగుమం అవుతుందన్న ప్రచారం కూడా లేకపోలేదు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.