మూవీ నేమ్: ‘కాంతార’విడుదల తేదీ: 15 అక్టోబర్, 2022నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తదితరులుసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్ఎడిటింగ్: కె.ఎమ్. ప్రకాశ్, ప్రతీక్ శెట్టినిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్తెలుగు విడుదల: గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్)నిర్మాత: విజయ్ కిరగందూరుకథ, దర్శకత్వం: రిషబ్ శెట్టి విధాత: కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే.. ‘KGF’కి ముందు, తర్వాత అనే విధంగా మాట్లాడుకునేలా చేసిందా చిత్రం. ఆ సినిమా తర్వాత […]
మూవీ నేమ్: ‘కాంతార’
విడుదల తేదీ: 15 అక్టోబర్, 2022
నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తదితరులు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్
ఎడిటింగ్: కె.ఎమ్. ప్రకాశ్, ప్రతీక్ శెట్టి
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్
తెలుగు విడుదల: గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్)
నిర్మాత: విజయ్ కిరగందూరు
కథ, దర్శకత్వం: రిషబ్ శెట్టి
విధాత: కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే.. ‘KGF’కి ముందు, తర్వాత అనే విధంగా మాట్లాడుకునేలా చేసిందా చిత్రం. ఆ సినిమా తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచిడి సినిమా వస్తుందంటే.. అన్ని సినిమాల ఇండస్ట్రీల కళ్లు ఆ సినిమాలపై పడుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన ‘విక్రాంత్ రోణ’ కూడా అంతటి క్రేజ్‌నే సొంతం చేసుకుంది. ఇక కొన్ని రోజులుగా ‘కాంతార’ అనే సినిమా పేరు కన్నడ ఇండస్ట్రీని దాటి మరీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ‘కెజియఫ్’ తర్వాత సక్సెస్ విషయంలో ఆ రేంజ్లో వినిపించిన పేరు ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా ‘కాంతార’ చిత్రమే.
విశేషం ఏమిటంటే.. ఈ సినిమాని కూడా ‘KGF’ చిత్ర బ్యానర్ అయిన హోంబలే ఫిల్మ్ నిర్మించడం. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ భారీ కలెక్షన్లను రాబడుతూ అందరితో ఔరా అనిపించుకుంటుంది. ఇప్పుడా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్లో అగ్రగామి సంస్థ అయిన గీతా ఆర్ట్స్ అందించింది. ట్రైలర్‌తోనే టాలీవుడ్‌లోనూ బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర పరిస్థితి ఏమిటో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కథగా చెప్పాలంటే ఇదొక చందమామ కథ అని చెప్పుకోవచ్చు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి కూర్చుని తిన్నా తరగని సంపద, అందమైన కుటుంబం. అయినా కూడా ఏదో వెలితి ఆ రాజుకి. అంత ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్న ఆ రాజు.. దాని కోసం దేశ పర్యటన చేస్తుంటాడు. ఈ పర్యటనలో భాగంగా అతనికి ఓ అడవిలో దైవ శిల కనిపిస్తుంది. ఆ శిల చూడగానే తెలియని మానసిక ప్రశాంతత ఆయనని ఆవహిస్తుంది. వెంటనే దానిని కావాలని కోరుకుంటాడు. ఆ శిల తీసుకుని.. ఆ ఊరి ప్రజలకు ఆ అడవితో పాటు కొంత భూమిని బదులుగా సమర్పించుకుంటాడు. అయితే.. ఆ ఇచ్చిన భూమిని మళ్లీ తను కానీ, తన వారసులు కానీ వెనక్కి ఇచ్చేయమని అడగకూడదు.. అలా అడిగితే దైవం చేతిలో శిక్షించబడతారని.. అక్కడ దైవం ఆవహించిన మనిషి ఆ రాజుకు షరతు విధిస్తాడు. అందుకు రాజు అంగీకరిస్తాడు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. ఆ రాజు చనిపోయిన తర్వాత కొడుకు వచ్చి.. ఆ భూమిని సొంతం చేసుకోవాలని భావిస్తాడు. కానీ రక్తం కక్కుకుని చనిపోతాడు.. ఇలా నడుస్తున్న ఈ కథలోకి ఓ ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ (కిశోర్) ఎంటరవుతాడు. అక్కడ ఉన్న భూమిని ఆ ప్రజలు ఆక్రమించుకున్నారని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలను శివ (రిషబ్ శెట్టి) తిప్పి కొడుతుంటాడు. మరోవైపు రాజ వంశీకుడైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) అనే దొర.. ఆ భూమిని దక్కించు కునేందుకు ఓ కుట్ర చేస్తాడు? ఆ కుట్ర ఏమిటి? ఆ కుట్రను శివ ఎలా తిప్పికొట్టాడు? మురళీ ద్వారా వచ్చిన చిక్కులను శివ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో దైవం పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే.. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సినిమాని చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాకి హీరో, దర్శకుడు రిషబ్ శెట్టినే. రెండింటికీ అద్భుతంగా న్యాయం చేశాడు. ఒక గొప్ప సినిమా చూశామనే భావనతో ప్రేక్షకులు బయటికి వస్తారంటే.. రిషబ్ ఎంతగా ప్రాణం పెట్టేశాడే అర్థం చేసుకోవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ఆయన నటన గురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు.. చెలరేగిపోయాడు. హీరోయిన్ సప్తమి గౌడ నటన చాలా న్యాచురల్‌గా ఉంది. హీరోకి స్నేహితులుగా చేసిన వారి పేర్లు తెలియవు కానీ.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం అద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. కిశోర్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. దొరగా అచ్యుత్ కుమార్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారు కూడా అద్భుతంగా చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ముందుకు కెమెరామ్యాన్‌కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఆయన సినిమా మూడ్‌ని క్యారీ చేసిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. అలాగే అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఇలాంటి సినిమాలకు సంగీతం అంటూ చేస్తే ఆయనే చేయాలి అనేంత గొప్పగా ఆయన ప్రతిభని కనబరిచారు. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త స్పీడప్ చేయాల్సింది. కొన్ని చోట్ల మరీ ల్యాగ్ అనిపించే సీన్లు ఉన్నాయి. అయితే దర్శకుడి కోసమే అయ్యిండొచ్చు. ప్రతీ సీన్ విపులంగా తెలియాలని.. అలా నడిపించి ఉండవచ్చు. నిర్మాణ విలువలు అద్భుతం అనే చెప్పాలి.
హోంబలే ఫిల్మ్ అంటే ఇంక వంక పెట్టాల్సిన అవసరం ఏముంది. ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా ఉంది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారనేది ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా విషయంలో రిషబ్ ప్రతిభకు అభినందనలు చెప్పకుండా ఉండలేం. ఒక సినిమా గురించి అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయంటే.. అది కథ, కంటెంట్ గొప్పతనం. దానిని పర్ఫెక్ట్గా సెట్ చేసి.. చూస్తున్న ప్రేక్షకులతో వావ్ అనిపించేలా చేశాడు. వేరొకరైతే.. ఎక్కడ ఈ కథ డైవర్ట్ అవుతుందో అని భావించి ఉంటాడేమో.. అందుకే తనే నటించి నవరసాలను పలికించాడు.
విశ్లేషణ:
ఈ తరహా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు.. కానీ ఏదో తెలియని మ్యాజిక్ అయితే ఈ సినిమాలో ఉంది. చాలా సహజత్వంగా సినిమా ఉంటుంది. మన కథలానే ఉంటుంది. మనం ఎక్కడో ఈ కథ గురించి చర్చించినట్లే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఇది కదా మన ప్రపంచం అని అనిపిస్తుంది. అడవి అందాలు, మట్టి సువాసనలు, రాజులు, దేవుడు.. ఇలా ప్రతీది టచ్ చేసుకుంటూ వెళ్లి.. చివరికి కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులలో కూడా అమ్మవారు ఆవహించిందా? అనేంతగా పూనకాలు వచ్చే స్థితితో బయటికి పంపించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు.
మధ్యమధ్యలో కాస్త ల్యాగింగ్ సీన్లు ఉన్నా.. వాటిని ఉత్కంఠభరిత సన్నివేశాలతో కవర్ చేస్తూ.. గ్రాఫ్‌ని లేపాడు దర్శకుడు. ఫస్టాప్ అంతా రాజులు, దైవ శిల అంటూ ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి.. ఇంటర్వెల్ టైమ్‌కి ప్రేక్షకుడికి మనమొక అద్బుతమైన ప్రపంచంలో ఉన్నామనే భ్రమని కలిగించేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత ప్రేమకథని అలాగే శివ, మురళీల మధ్య గొడవలతో నడిపి.. చివరికి దొరకి, ఊరి ప్రజలకు మధ్య ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో వైవిధ్యంగా మలిచాడు.
ఇక ఆ తర్వాత ఉంటది.. భూత కోలా అంటూ ‘శివ’ తాండవమే. ఇది చెబితే వచ్చే ఫీల్ కంటే కూడా.. చూస్తే వచ్చే ఫీలే మంచి కిక్కు ఇస్తది. మొత్తంగా అయితే.. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రం రాలేదని చెప్పుకోవచ్చు. పెట్టిన ప్రతి రూపాయికి సరిపడా ఎంటర్టైన్మెంట్ని, థ్రిల్లింగ్ని ఈ సినిమా ఇస్తుంది. అందులో నో డౌట్. మన మూలాలను మనం మరువకూడదని చెప్పడానికి చేసిన గొప్ప ప్రయత్నమే ఈ సినిమా. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. అలాంటి కంటెంట్ ఇందులో ఉంది.
చివరగా.. ఈ సినిమా చూశాక మనకు మన మేడారం సమ్మక్క సారాలమ్మ దేవతలు గుర్తుకురావాల్సిందే. వారు కూడా తమ ఉంటున్న ఆడవిని, అక్కడి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి కాకతీయులతో పోరాడి చివరికి చిలకలగుట్ట పైకి చేరి ఆదృశ్యం అవుతారు. ఈ సినిమాలో కూడా హీరోకి దేవుడు ఆవహించి ప్రత్యర్థులతో పోరాడి ఆడవిలోకి వెళ్లి ఆదృశ్యం అవుతాడు.
ట్యాగ్‌లైన్: ఇదీ సినిమా అంటే.. ‘శివ’ తాండవమే!
రేటింగ్: 3.75/5