Karimnagar: ఇంటికో ఉద్యోగమన్నారు.. ఇంటికో గొర్రె, బర్రె ఇస్తున్నారు: భట్టి

రీయింబ‌ర్స్‌మెంట్ లేదు.. ట్యూషన్ ఫీజు రాదు ధరణితో నానా రకాలు ఇబ్బందులు పడుతున్నాం భ‌ట్టి విక్రమార్క పాదయాత్రలో విద్యార్థులు, రైతుల ఆవేదన విధాత బ్యూరో, కరీంనగర్: ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు.. ట్యూషన్ ఫీజు కూడా అందడం లేదు.. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచుతూ పోతున్నాయి.. వీటిని కట్టుకునే స్తోమత లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం.. ప్రత్యూష, పరిమళ అనే విద్యార్థినులు తమ ఆవేదనను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి […]

  • Publish Date - April 20, 2023 / 02:08 PM IST
  • రీయింబ‌ర్స్‌మెంట్ లేదు.. ట్యూషన్ ఫీజు రాదు
  • ధరణితో నానా రకాలు ఇబ్బందులు పడుతున్నాం
  • భ‌ట్టి విక్రమార్క పాదయాత్రలో విద్యార్థులు, రైతుల ఆవేదన

విధాత బ్యూరో, కరీంనగర్: ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు.. ట్యూషన్ ఫీజు కూడా అందడం లేదు.. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచుతూ పోతున్నాయి.. వీటిని కట్టుకునే స్తోమత లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం.. ప్రత్యూష, పరిమళ అనే విద్యార్థినులు తమ ఆవేదనను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ముందుంచారు.

పేపర్ లీకేజీల వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి సన్నగిల్లి పోయింది.. చదువు పూర్తయ్యాక ఏదో పని వెతుక్కోవడమో, ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేసుకోవడమో, అని ఆలోచన కలుగుతోందని నగేష్ అనే విద్యార్థి వాపోయారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అన్నారు.. ప్రస్తుతం ఇంటికో గొర్రె, బర్రె ఇస్తున్నారు.. ఉద్యోగాల కోసం చదవడం మానేసి గొర్రెలో, బర్రెలో కాచుకొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందని అనిల్ కుమార్ అనే విద్యార్థి వాపోయారు.

ప్రభుత్వ,ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే ఆడపిల్లలకు సరైన రక్షణ లేకుండా పోయిందని రామకృష్ణ అనే విద్యార్థి తన మనోగతం వెల్లడించారు.

ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో ఉంది. దీంతో చదువు పూర్తి చేసినా ఆయా విద్యా సంస్థల నుండి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉందని దాసరి విజయ్ కుమార్ అనే విద్యార్థి విద్యార్థుల దీనస్థితిని ఏకరువుపెట్టారు.

విద్యార్థుల ఇబ్బందులు, ఆవేదనను ఓపికగా విన్న విక్రమార్క విద్యావ్యవస్థ అత్యున్నతంగా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. మానవ వనరులతోనే దేశ సంపద ముడిపడి ఉంటుందని చెప్పారు.
మానవ వనరులపై చేసే ఖర్చును ప్రభుత్వం పెట్టుబడి కింద చూడాల్సి ఉంటుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడు విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాలను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2007లోనే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉన్నత విద్యను ప్రతి ఒక్కరి చెంతకు తీసుకురావడానికి తాము ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేస్తూ, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విద్యా వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థలోని లోసుగులను సరి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

ధరణితో నష్టపోతున్నాం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తమ భూములపై తమకే హక్కు లేకుండా చేసిందని కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జిల్లెల్ల ఐలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.
తమ గ్రామంలో 10 నుండి 15 కుటుంబాలు ధరణి కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విక్రమార్క దృష్టికి తెచ్చారు.

2010లో తాను 774 సర్వే నెంబర్ లోని 16 గుంటల భూమిని కొనుగోలు చేస్తే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదార్ పాస్ బుక్ కూడా మంజూరు చేసిందని, దానిపై వ్యవసాయ రుణాలు పొందుతున్నానని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ భూమిపై తనకు హక్కు లేకుండా చేసిందన్నారు.
ఇప్పటికీ భూమి అమ్మిన వ్యక్తి పేరిటే యాజమాన్య హక్కులు చూపిస్తున్నారని ఆవేదన చెందారు.
ఈ సందర్భంగా విక్రమార్క వారిని ఓదారుస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.