ప్రజావాణిలో కలెక్టర్ పైనే కలెక్టర్‌కు ఫిర్యాదు.. షాక్ తిన్న ప్రస్తుత కలెక్టర్

జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సర్పంచ్ ఫిర్యాదు విధాత బ్యూరో, కరీంనగర్: మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న పాఠశాలల మరమ్మతులు,పాఠశాలల్లో మరుగుదొడ్లు మూత్ర శాలల నిర్మాణాలు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని శాసనసభ్యుడు, కలెక్టర్ సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా పనులు చేపట్టిన ఓ సర్పంచ్ నాలుగు నెలలు గడుస్తున్నా నయా పైసా చేతికి […]

  • By: krs    latest    Mar 15, 2023 3:13 AM IST
ప్రజావాణిలో కలెక్టర్ పైనే కలెక్టర్‌కు ఫిర్యాదు.. షాక్ తిన్న ప్రస్తుత కలెక్టర్

జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సర్పంచ్ ఫిర్యాదు

విధాత బ్యూరో, కరీంనగర్: మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న పాఠశాలల మరమ్మతులు,పాఠశాలల్లో మరుగుదొడ్లు మూత్ర శాలల నిర్మాణాలు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని శాసనసభ్యుడు, కలెక్టర్ సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా పనులు చేపట్టిన ఓ సర్పంచ్ నాలుగు నెలలు గడుస్తున్నా నయా పైసా చేతికి రాకపోవడంతో స్వయంగా కలెక్టర్ పైనే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

పనులకు పురమాయించిన కలెక్టర్ ఇక్కడి నుండి బదిలీ కాగా నూతనంగా వచ్చిన కలెక్టర్ ఈ ఫిర్యాదుతో ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేనందున కాస్త ఓపిక పట్టాలని సదరు సర్పంచ్ కు నచ్చ చెప్పారు. అయితే సాక్షాత్తు కలెక్టర్‌పై ఓ సర్పంచ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కొడిమ్యాల మండలం దమ్మాయిపేట వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, బాత్రూం పనులను స్థానిక సర్పంచ్ తునికి నరసయ్య చేపట్టారు. ఇందులో 20 లక్షల విలువచేసే 56 మీటర్ల ప్రహరీ గోడ నిర్మాణం పని మూడు నెలల క్రితమే పూర్తి చేశారు. పనులు ప్రారంభం కాగానే తొలుత 9 లక్షల వ్యయానికి ఎంబి రికార్డ్ చేసిన అధికారులు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసినా నయా పైసా చెల్లించలేదు.

గతంలో ఇక్కడ పనిచేసి మహబూబ్ నగర్‌కు బదిలీపై వెళ్లిన గుగులోతు రవికి పలుమార్లు నిధుల విడుదల గురించి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని సర్పంచ్ వాపోయారు. దీంతో ఆయన ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషను కలిసి గత కలెక్టర్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు అందించారు.

ట్రాక్టర్లు, మెటీరియల్ కూలీలకు అప్పులు చేసి డబ్బు చెల్లించిన తాను ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొం టున్నానని, ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో తాను తీవ్ర వత్తిడికి లోనవుతున్నట్లు సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించి బిల్లులు తక్షణమే ఇప్పించాలని ఆయన ప్రస్తుత కలెక్టర్ ను వేడుకున్నారు. గ్రామ సర్పంచ్ గత కలెక్టర్ పై ప్రస్తుత కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.