బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) ను అమలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నోటిఫికేషన్‌ను కూడా జత చేశారు. దీంతో పాత పెన్షన్ స్కీమ్ కోసం పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జనవరి 24న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. 2006 తర్వాత రిక్రూట్ అయిన దాదాపు 13 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు కానుంది. న్యూ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్) ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు. అయితే ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెలో ఉన్న ఎన్‌పీఎస్ ఉద్యోగుల డిమాండ్ నెరవేరుస్తామని చెప్పామని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఆ హామీల మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ నిర్ణయం 13 వేల మంది ఎన్‌పీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పును ఇస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ఓపీఎస్‌కు అర్హులైన ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం వన్ టైమ్ ఆప్షన్ కల్పించింది. జూన్ 30, 2024 లోపు వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక తమ విభాగ అధిపతులకు జులై 31, 2024 లోపు ప్రతిపాదనలు పంపాలి. ఆ తర్వాత 2024, ఆగస్టు 31 లోపు ఆర్థిక శాఖకు పంపి ఆమోదం పొందాలి.
కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీఎస్ షడక్షరి హర్షం వ్యక్తం చేశారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం నుంచి తమకు హామీ లభించిందని, ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓపీఎస్ అమలుతో రాష్ట్ర ఖజానాపై గణనీయంగా ఆర్థిక భారం పడనుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కర్ణాటక ఆరోగ్య సంజీవని పథకాన్ని అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ పథకం ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ పథకం అమలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేస్తుందన్నారు సిద్ధరామయ్య.
పాత పెన్షన్ విధానం ప్రకారం.. పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తారు. 2023లో నాటి ఎన్డీయే ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి తన మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేయాలి. ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది.