రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి కర్ణాటక ప్రభుత్వం జరిమానా విధించడం చర్చనీయాంశమైంది.

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

విధాత: రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి కర్ణాటక ప్రభుత్వం జరిమానా విధించడం చర్చనీయాంశమైంది. రామ్‌లల్లా(బాలక్ రామ్‌) విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించిన శ్రీనివాస్‌ నటరాజ్‌కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ జరిమానా విధించింది. ప్రైవేట్‌ స్థలంలో అక్రమంగా మైనింగ్‌ చేశారని ఆరోపిస్తూ శ్రీనివాస్‌ నటరాజ్‌పై 80 వేల జరిమానా విధించింది.


జరిమానా మొత్తాన్ని నటరాజ్‌ తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి కట్టానని ఆవేదన వెలిబుచ్చిన వార్త నెట్టింటా వైరల్‌గా మారింది. నాకు రాముడి విగ్రహ తయారీ శిలను తీసి రవాణా చేయడానికి సుమారు రూ. 6 లక్షలు ఖర్చు కాగా, ట్రస్ట్‌తో సంబంధం ఉన్న శ్రీనాథ్ అనే వ్యక్తి నుండి ఇప్పటివరకు రూ. 1.95 లక్షలు మాత్రమే అందాయని నటరాజ్ చెప్పాడు. ఒక భారీ బండను మూడు బ్లాకులుగా విభజించగా శిల్పి యోగిరాజ్ ఒక బ్లాకును ఎంచుకున్నాడని, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుల విగ్రహాలను చెక్కడానికి కూడా ఇక్కడి నుంచే శిలలను తీసుకున్నారని తెలిపారు.


51అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ జీవకళ ఉట్టిపడేలా చిరుమందహాసంతో భక్తులను కళ్లతోనే పలకరిస్తున్నట్లుగా అద్భుతంగా చెక్కారు. విగ్రహం చెక్కేందుకు సేకరించిన కృష్ణ శిలను కర్ణాటక మైసూర్ జిల్లాలోని జయపుర హోబ్లీ( గుజ్జనగౌడపురం) గ్రామం నుంచి తీసుకొచ్చారు. దళితుడైన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసిన రాందాస్ తనకున్న 2.14 ఎకరాల భూమిలో వ్యవసాయ అవసరాల కోసం రాళ్లను తొలగించే పనిని కాంట్రాక్టర్ నటరాజ్‌కు అప్పగించాడు.


రాయి వెలికి తీసిన స్థలానికి దక్షిణం వైపు ఆంజనేయ దేవాలయం ఉండగా, ఆలయంలోని ఆంజనేయ విగ్రహం రాయిని తవ్విన ప్రదేశాన్ని రామ్‌లల్లా విగ్రహం కోసం చూస్తున్నట్లుగా కనిపించేదని రాందాస్ అభిప్రాయపడ్డారు. దీంతో తాను కూడా తన స్థలంలో రామమందిరం నిర్మించేందుకు నాలుగు గుంటల భూమిని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని చెక్కడానికి మేము అరుణ్ యోగిరాజ్‌ను కలుస్తామని రాందాస్ తెలిపారు.


కాగా రామ్‌లల్లా విగ్రహం తయారీ శిలను వెలికి తీసిన స్థల యజమాని రైతు రాందాస్‌కు గాని, కాంట్రాక్టర్ శ్రీనివాస్ నటరాజ్‌కు గాని అయోధ్య విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి ఆహ్వానం దక్కలేదు. అయినప్పటికి తన భూమిలోని శిలతో రామ్‌లల్లా రూపుదిద్దుకోవడం పట్ల రాందాస్‌, తనతో శిల సేకరణ చేయించుకున్నందుకు నటరాజ్‌లు ఇద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.


అటు రామ్‌లాల్ల విగ్రహ తయారీకి వినియోగించిన కృష్ణ శిల 250కోట్ల సంవత్సరాల పురాతనమైందని బెంగళూరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ రాక్ మెకానిక్స్‌(ఎన్ఐఆర్‌ఎం)డైరక్టర్ హెచ్‌ఎస్‌. వెంకటేశ్ ఇప్పటికే దృవీకరించారు. ఎలాంటి వాతావరణాన్నైైనా తట్టుకుని ధృడంగా ఉండే శిలతో రూపొందించిన బాలరాముడి విగ్రహం భక్తజనాన్ని ఆకట్టుకుంటుంది.