Karnataka
విధాత: కర్ణాటకలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిజంగా కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కేసీఆర్ కోరుతుంటే.. ఆ రాష్ట్రానికి వెళ్లి మీడియా సమావేశం పెట్టి బీజేపీని ఓడించాల్సిందిగా ప్రజలకు పిలుపునివ్వాలని సవాల్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్ గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే తెలంగాణ మోడల్ కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ చెప్పారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆర్ ఎస్ లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారని, ఏప్రిల్ 10న బీఆర్ ఎస్ లో చేరిన అతనిని మే 2న సీఎం ప్రైవేటు సెక్రటరీగా నియమించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని ఆరోపించారు.
సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎవరి సొమ్మని ఏడాదికి 18లక్షలు అతనికి జీతం ఇస్తున్నారన్న రేవంత్‌రెడ్డి.. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సచివాలయాన్ని తన ప్రయివేట్ ఎస్టేట్ అనుకుంటున్నారని, త్వరలోనే ఆయన భ్రమలు తొలగిపోతాయని చెప్పారు. బంగాళాలు మారినంత మాత్రాన కేసీఆర్ వంకరబుద్ధి మారదని విమర్శించారు.
ఈ నెల 8న సరూర్ నగర్ లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ ప్రకటించారని, అదే పద్ధతిలో యూత్ డిక్లరేషన్ ప్రియాంక చేస్తారని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసి, చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలను సంతలో సరుకులా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 2లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ‘తెలంగాణలోని 20లక్షల విద్యార్థులకు, 30లక్షల నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. 8న జరిగే యువ సంఘర్షణ సభకు తరలిరండి’ అని ఆయన పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్ లా సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు.
కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్దతుగా తరలిరావాలని కోరారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి వస్తే హనుమాన్ చాలీసా చదువుకుందామని రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎం తో కలిసిపోయారని ఆరోపించారు. 40శాతం కమీషన్ల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి నినాదాలు ఇస్తున్నదని మండిపడ్డారు. సచివాలయంలో నల్ల పోచమ్మ దేవాలయాన్ని కూల్చితే మాట్లాడని కిషన్ రెడ్డి హనుమాన్ చాలీసా గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు.