Karnataka Polls, Priyanka Gandhi
విధాత: ఎన్నికల ప్రచారంలో నాయకులు ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అదే క్రమంలో ప్రియాంక గాంధీ కూడా ఓ ప్రయత్నం చేశారు. మైసూరులో ఒక హోటల్‌కు వెళ్లిన ప్రియాంక అక్కడ కిచెన్‌లోకి వెళ్లి.. చక్కగా దోశలు వేశారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, పార్టీ సహ నేత రణ్‌దీప్ సుర్జేవాలాతో కలిసి ఆమె మైసూరు వెళ్లారు. అక్కడ మైలారి అనే హోటల్ చాలా పాపులర్. మైసూరులో అత్యంత పాత హోటళ్లలో అది ఒకటి.
అక్కడ కిచెన్‌లోకి వెళ్లిన ప్రియాంకగాంధీ.. చక్కగా దోశ వేశారు. రెడీ అయిన దోశలను ప్లేట్‌లోకి తీశారు. దోశ మాస్టర్‌తో సరదాగా మాట్లాడారు. దోశలు వేయడం, తినడం పూర్తయిన తర్వాత ప్రియాంకతో ఆ హోటల్ యజమాని కుంటుంబ సభ్యులు సెల్ఫీ దిగారు. తనకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రియాంక వారికి కృతజ్ఞతలు తెలిపారు.
‘ప్రఖ్యాత మైలారి హోటల్‌లో దోశలు వేయడాన్ని ఎంజాయ్ చేశాను. వారి నిజాయితీ, కష్టపడి పనిచేసే మనస్తత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. దోశలు చాలా రుచికరంగా ఉన్నాయి. వీలైనత త్వరలో నా కూతురిని ఇక్కడకు తీసుకువచ్చి మళ్లీ దోశలు తినాలని ఉన్నది’ అని ప్రియాంక అనంతరం ట్వీట్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. మొత్తం 224 స్థానాలకు మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మంగళవారం మైసూరులో జరిగిన సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. ‘ఇక్కడకు మొన్న ప్రధాన మంత్రి వచ్చి, ప్రతిపక్ష నాయకులు ఆయనకు గొయ్యి తవ్వాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదేం భాష? ప్రతి భారతీయుడు తమ ప్రధాన మంత్రి ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటారు’ అని చెప్పారు.
కర్ణాటక ఓటర్లు నాయకులు చెప్పిన మాటలు విని ఓటు వేయొద్దని, అంతరాత్మ చెప్పిన దాని ప్రకారం నచ్చిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు. కర్ణాటకలో మార్పునకు సమయం ఆసన్నమైందన్న ప్రియాంక.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన నిర్మాణాత్మక పని ఒక్కటీ లేదని విమర్శించారు.